ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటర్వ్యూలో పాల్గొన్న బస్ కండక్టర్
– విధుల నుంచి తొలగించిన
అధికారులు
అన్నానగర్: నీలగిరి జిల్లాలోని కూడలూరు రాష్ట్ర రవాణా సంస్థలో కండక్టర్ గా పనిచేస్తున్న నెడుంచెళియన్, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండగా ఎన్నికలలో పోటీ చేయకూడదనే నిబంధనను ఉల్లంఘించి డీఎంకే అభ్యర్థి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీని తరువాత, రవాణా శాఖ అధికారులు నెడుంచెళియన్‌ను ఉద్యోగం నుండి తొలగించి చర్య తీసుకున్నారు. కాగా ఆయన కొన్ని రోజుల్లో పదవీ విరమణ చేయాల్సి ఉండడం గమనార్హం.
మహిళ అనుమానాస్పద మృతి
అన్నానగర్: చైన్నెలోని వ్యాసర్‌పాడి మూర్తినగర్ ప్రాంతానికి చెందిన కార్తీక్ (34). ఇతని భార్య సుకన్య (31). ఆదివారం భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో తన భార్య కత్తెరతో మెడలో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేసిందని తెలుస్తోంది. కార్తీక్ సుకన్యను ప్రాణాపాయ స్థితిలో స్టాన్లీ ఆసుపత్రిలో చేర్పించాడు. వైద్యుల పరీక్షలో సుకన్య అప్పటికే మరణించినట్లు తేలింది. ఈ విషయమై ఎం.కె.బి. నగర్ పోలీసులు కేసు నమోదు చేసి, కుటుంబ కలహాల కారణంగా సుకన్య కత్తెరతో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుందా? లేక కార్తీక్ తన భార్యను కత్తెరతో పొడిచి చంపాడా? అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా, వ్యాసర్‌పాడిలోని ముల్లై నగర్ శ్మశానవాటిక ప్రాంతంలోని ఒక ముళ్లపొదలో 50 ఏళ్ల పురుషుడి మృతదేహం లభ్యమైంది. అతను ఎవరు? ఏ గ్రామానికి చెందినవాడు? అతని శరీరం పై గాయాలు ఉండటంతో కొట్టి చంపారా? అనే విషయాలపై ఎం.కె.బి. నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రెండేళ్ల చిన్నారి మృతిపై
కేసు నమోదు
అన్నానగర్: చైన్నెలోని వేలచ్చేరి, రాజీవ్ నగర్‌కి చెందిన ప్రవీణ్ కుమార్. ఇతని భార్య సుబ్బులక్ష్మి. వీరి రెండేళ్ల కుమార్తె యుగ. ఈమెకి వాంతులు, జ్వరం రావడంతో ఆమె తల్లిదండ్రులు యుగను వేలచ్చేరిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. కానీ అక్కడ సరైన చికిత్స అందకపోవడంతో ఆ చిన్నారి సోమవారం మరణించింది. చిన్నారి మరణానికి గల కారణాల పై వేలచ్చేరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చైన్నెలో జాతీయ స్థాయి కళా ప్రదర్శన
సాక్షి, చైన్నె: శ్రీ దర్శిని కలైకూడం ఆధ్వర్యంలో 21వ వార్షిక జాతీయ స్థాయి కళా ప్రదర్శన చైన్నె థౌజండ్ లైట్స్ గ్రీమ్స్ రోడ్డులో ఉన్న లలిత కళా అకాడమీలో ప్రారంభమైంది. ఈ ప్రతిష్టాత్మక కళా ప్రదర్శన లో ఆంధ్రప్రదేశ్‌తో పాటూ దేశ నలుమూలల నుండి 260 మంది కళాకారులు రూపొందించిన 350 అద్భుతమైన కళాఖండాలను కొలువుదీర్చారు. వీటి మొత్తం అంచనా విలువ రూ. 2.45 కోట్లు .ఈ ప్రదర్శన సాంప్రదాయ , వాస్తవిక శైలుల నుండి సమకాలీన ఆధునిక కళ వరకు గొప్ప వైవిధ్యాన్ని తలపిస్తోంది. తైలవర్ణ జలవర్ణ చిత్రాలు, మిశ్ర మ మాధ్యమ సృజనాలు, తంజావూరు , మై సూరు చిత్రకళ వంటి సాంప్రదాయక రూపాల తో పాటు ఉత్సాహభరితమైన గిరిజన కళతో సహా విసృత శ్రేణి కళాకృ తులు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. అలాగే ఈ ప్రదర్శనలో కాగితపు శిల్పాలు, మట్టి నమూనాలు, లోహం, చెక్క , రాతితో రూపొందించిన శిల్పాలు, అలా గే పలు డిజైన్లతో కూడిన సిరామిక్ బొమ్మలతో సహా శిల్పకృతులు కనువిందు చేస్తున్నాయి. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రఘుపతి , లలిత కళా అకాడమీ ప్రాంతీయ కార్యదర్శి శోవన్ కుమార్, రాయపురంలోని సుధా ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ పాండియరాజ్, అంతర్జాతీయ వాలీబాల్ రిఫరీ నందగోపాల్, చిత్రకారులు రాఖీ తదితర ప్రముఖ అతిథులతో కలిసి జాతీయ స్థాయి కళా ప్రదర్శనను ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రదర్శన ఏప్రిల్ 4, కొనసాగుతుందని శ్రీ దర్శిని కలైకూడం వ్యవస్థాపకులు ధర్మలింగం తెలిపారు.
శ్రీలంకకు అక్రమంగా
తరలించే యత్నం
– రూ.50 లక్షల విలువైన పసుపు, బొగ్గు, విదేశీ సిగరెట్లు స్వాధీనం
అన్నానగర్: శ్రీలంకకి అక్రమంగా తరలించేందుకు యత్నిస్తున్న రూ.50 లక్షల విలువైన పసుపు, బొగ్గు, విదేశీ సిగరెట్లు వంటి వివిధ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. రామనాథపురం జిల్లాలోని కీళకరై చెక్‌పోస్ట్ వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఆదివారం రాత్రి వాహన తనిఖీ నిర్వహించారు. ఆ సమయంలో, అటుగా వెళ్తున్న ఒక సరుకు రవాణా వాహనాన్ని వారు ఆపి తనిఖీ చేశారు. అనుమానం రావడంతో ఆ వాహనాన్ని రహస్యంగా అనుసరించారు. మండపం ఉత్తర తీరానికి సమీపంలోని డి. నగర్ ప్రాంతంలోని ఓ గోడౌన్ వద్ద సరుకు రవాణా వాహనం వెళ్లడంతో దాడులు నిర్వహించారు. గోడౌన్‌లోని 2 టన్నుల పసుపు బస్తాలు, 10,000 విదేశీ సిగరెట్లు, 308 కేజీల బొగ్గు, 100 బీడీల కట్టలు, 56 లీటర్ల పురుగుమందు, 10 కేజీల యాలకులు, 60 కేజీల పసుపు పొడిని స్వాధీనం చేసుకున్నారు. సరుకుల అంతర్జాతీయ విలువ సుమారు రూ. 50 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు.


