సాక్షి, చైన్నె: మధుమేహం , ఇతర జీవక్రియ సంబంధిత వ్యాధులపై పరిశోధనల్లో ప్రపంచ గుర్తింపు పొందిన మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ ( ఎండీఆర్‌ఎఫ్) జెనోమిక్స్ మల్టీ–ఓమిక్స్ రంగాలలో తన సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడానికి ప్రేమాస్ లైఫ్ సైన్సెస్ తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. సోమవారం చైన్నెలో ఈ మేరకు ఇరు సంస్థలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.
అధునాతన సాంకేతికత
ఈ ఒప్పందం ద్వారా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ‘ఇల్యూమినా’ సీక్వెన్సింగ్ టెక్నాలజీని తన పరిశోధనల్లో ఎండీఆర్‌ఎఫ్ వినియోగించుకోనుంది.రోగి జన్యు క్రమాన్ని బట్టి సరైన చికిత్స అందించే ‘ప్రెసిషన్ మెడిసిన్’ విభాగంలో వినూత్న ఆవిష్కరణలు చేయడం ఈ సహకారం ముఖ్య ఉద్దేశంగా ప్రకటించారు. కేవలం పరిశోధనలకే పరిమితం కాకుండా, ఈ భాగస్వామ్యం ద్వారా వైద్యులు, పరిశోధకులు , విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఎండీఆర్‌ఎఫ్ చైర్మన్ డాక్టర్ వి మోహన్ మాట్లాడుతూ, మధుమేహం వంటి సంక్లిష్ట వ్యాధులను నివారించడానికి, మెరుగ్గా నిర్వ హించడానికి అత్యాధునిక సాంకేతికతలను క్లినికల్ పరిశోధనతో అనుసంధానించడం చాలా అవసరంగా పేర్కొన్నారు. భారతదేశంలో బలమైన శాసీ్త్రయ పర్యావరణ వ్యవస్థను నిర్మించడమే తమ లక్ష్యం అని, అందుకే ఈ ఒప్పందం అని ఈసందర్భంగా ప్రేమాస్ లైఫ్ సైన్సెస్ ఎండీ ప్రవీణ్ గుప్తా ప్రకటించారు. కార్యక్రమంలో డాక్టర్ మహ్మద్ ఇమ్రాన్, డాక్టర్ రాధా వెంకటేశన్, డాక్టర్ ఆర్‌ఎం అంజన, డాక్టర్ దేబ్జానీ సాహా పాల్గొన్నారు.


