తిరుత్తణి: రేషన్ దుకాణాల్లో మద్యం విక్రయం, బాలికలు, మహిళలపై చోటుచేసుకుంటున్న లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేలా కోర్టు అనుమతితో సెక్స్ వర్కర్ కేంద్రాల ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని స్వతంత్ర అభ్యర్థి ఇచ్చిన ఎన్నికల హామీ కలకలం రేపుతోంది. తిరుత్తణి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి వీరమంగళం గ్రామానికి చెందిన సేడ్డు అనే వ్యక్తి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇందుకోసం తిరుత్తణి ఆర్డీఓ కార్యాలయానికి సైకిల్‌లో చేరుకున్నారు. నామినేషన్ దాఖలు చేసి అతను మాట్లాడుతూ.. 15 ఏళ్ల నుంచి ఎన్నికల్లో పోటీ కోసం ప్రతి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్లు వేసి, పోటీ చేస్తున్నట్టు తెలిపారు. ఉచిత పథకాలకు తాను వ్యతిరేకమని, ఉచితాలు వ్యతిరేకించేవారు మాత్రం తనకు ఓటు వేయాలన్నారు. తనను గెలిపిస్తే రేషన్ దుకాణాల ద్వారా మద్యం సరఫరా చేస్తామని, రైతులకు, నేత కార్మికులకు ఉచిత విద్యుత్ రద్దు చేస్తామన్నారు. సెక్స్ వర్కర్లను ప్రోత్సహిస్తామన్న హామీలు ప్రజల మధ్యలో కలకలం రేపుతున్నాయి.


