రాందాసుకు షాక్
సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ పట్టాలి మక్కల్ కట్చి( పీఎంకే) రాందాసు శిబిరంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్ , యువజన విభాగం నేత అన్బుమణి రామదాస్ మధ్య పెరుగుతున్న విభేదాలతో ఇప్పటికే పార్టీ ముక్కలైంది. పార్టీలోని ప్రధాన సామాజిక వర్గమైన వన్నియర్ సంఘం కార్యవర్గ సభ్యులలో మెజారిటీ నాయకులు రాందాస్ నిర్ణయాలపై సంతృప్తికరంగా ఉన్నారు. ఈ పరిస్థితులలో రాందాసుకు వెన్నదన్నగా ఉన్న పార్టీ గౌరవ అధ్యక్షులుగా ఉన్న జీకే మణి తాజాగా అసంతృప్తితో ఉన్నట్టు వెలుగు చూసింది. కాంగ్రెస్‌లోకి తమిళకుమారన్: జీకే మణి కుమారుడు , ప్రముఖ నిర్మాత తమిళకుమారన్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. కేవలం 5 నెలల క్రితమే ఈయనకు పీఎంకే యువజన విభాగం అధ్యక్ష పదవిని రాందాస్ కట్టబెట్టారు. తమిళకుమారన్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాందాస్, ఆయన్ను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. యువజన విభాగం అధ్యక్ష పదవిని తన మనవడు ముకుంద్ కు అప్పగించాలని రాందాస్ భావిస్తున్నట్లు సమాచారం.


