ఎవర్నీ కాపీ కొట్టలేదు..! | - | Sakshi
Sakshi News home page

ఎవర్నీ కాపీ కొట్టలేదు..!

Mar 31 2026 8:32 AM | Updated on Mar 31 2026 8:32 AM

● మా మేనిఫెస్టో ప్రజల ఆకాంక్ష ● ఎంపీ కనిమొళి స్పష్టీకరణ

సాక్షి, చైన్నె: డీఎంకే ఎన్నికల ప్రణాళికపై వస్తున్న విమర్శలను ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి, ఎంపీ కనిమొళి ఘాటుగా తిప్పికొట్టారు. చైన్నెలోని అన్నా అరివాలయంలో మీడియాతో సోమవారం మాట్లాడిన ఆమె, తమ మేనిఫెస్టోను అన్నాడీఎంకే లేదా ఇతర పార్టీల నుండి కాపీ చేయలేదని, ఇది క్షేత్రస్థాయిలో ప్రజల నుండి సేకరించిన అభిప్రాయాల ప్రతిరూపమని స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో డిఎంకె ఇచ్చిన 503 హామీలలో ఇప్పటికే 404 హామీలను(80 శాతంకు పైగా )సీఎం స్టాలిన్‌ అమలు చేశారని వివరించారు. మిగిలిన 101 హామీలలలో 37 హామీలు కేంద్ర ప్రభుత్వ సహకారంపై ఆధారపడి ఉన్నాయని, మిగిలిన 64 హామీలు కొన్ని ఆచరణాత్మక ఇబ్బందులు, ప్రజల వ్యతిరేకత కారణంగా పెండింగ్‌లో ఉన్నాయని ఆమె వివరించారు. ఎన్నికల హామీల్లో లేకపోయినప్పటికీ మరెన్నో పథకాలు అమలు చేశామని వివరించారు.

మేనిఫెస్టో తయారీలో ఏఐ సాంకేతికత

ఈసారి ఎన్నికల ప్రణాళికను రూపొందించడానికి డీఎంకే కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడమే కాకుండా, ఆధునిక సాంకేతికతను వినియోగించుకుందన్నారు. ఈమెయిల్స్‌, వాట్సాప్‌ , ఏఐ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అందిన సుమారు 80 వేల సూచనలను విశ్లేషించి ఈ నివేదికను సిద్ధం చేశామని వివరించారు. ప్రతి రంగంలోని నిపుణులతో సంప్రదింపులు జరిపి, ఆచరణ సాధ్యమయ్యే హామీలనే మేనిఫెస్టోలో చేర్చామని ఆమె తెలిపారు. మహిళా సాధికారతపై ప్రత్యేక దష్టి సారించిన డిఎంకె, ఈసారి శ్రీకూపన్‌ విధానాన్నిశ్రీ ప్రతిపాదించిందన్నారు. వాషింగ్‌ మెషీన్‌, రిఫ్రిజిరేటర్‌ లేదా మైక్రోవేవ్‌ ఓవెన్‌ వంటివి కేవలం విలాస వస్తువులు కాదని, అవి మహిళల శ్రమను తగ్గించి, సమయాన్ని ఆదా చేసే ‘పెట్టుబడులు’ అని కనిమొళి అభిప్రాయపడ్డారు. ఒకరి ఇంట్లో ఇప్పటికే ఫ్రిజ్‌ ఉంటే, వారు తమకు నచ్చిన మరో వస్తువును కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఈ వోచర్‌ విధానం ద్వారా కలుగుతుందని ఆమె వివరించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు సొంత వ్యాపారాలు ప్రారంభించడానికి రాయితీ రుణాలను కూడా మేనిఫెస్టోలో పొందుపరిచామన్నారు. ఇతరు మేనిఫెస్టోను చదవాల్సిన అవసరం గానీ, సమయం గానీ తమకు లేదని వివరించారు. ‘ద్రవిడ మోడల్‌’ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే తమ లక్ష్యమని, ప్రతిపక్షాల విమర్శల్లో పసలేదని కనిమొళి కొట్టిపారేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement