సాక్షి, చైన్నె: ఎంజీ మోడళ్ల ధరలు ఏప్రిల్ 1 నుంచి 2 శాతం పెరుగుతున్నట్లు జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటారు ఇండియా ప్రకటించింది. ఎంజీ పోర్ట్‌ఫోలియో ధరల పెంపును సోమవారం స్థానికంగా ప్రకటించారు. నిరంతరం పెరుగుతున్న ముడిసరుకు ఖర్చుల ప్రభావాన్ని పాక్షికంగా భర్తీ చేయడమే ఈ ధరల సవరణ లక్ష్యంగా వివరించారు.మోడల్ వారీ ధరల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి, వినియోగదారులు తమ సమీపంలోని డీలర్‌షిప్‌ను సంప్రదించాలని లేదా అధికారిక ఇండియా వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
తిరుత్తణి: పాండవుల జననం సందర్భంగా రెండు వేల బిస్కెట్ల ప్యాకెట్లతో అలంకరణ చేపట్టారు. పట్టణ వీధుల్లో ద్రౌపదీ దేవిని ఊరేగించారు. తిరుత్తణి గాంధీరోడ్డులోని ద్రౌపదీదేవి ఆలయంలో అగ్నిగుండ తిరునాళ్లు కోలాహలంగా నిర్వహిస్తున్నారు. 18 రోజుల ఉత్సవ వేడుకల్లో ప్రధానమైన అగ్నిగుండ వసంతోత్సవం 12వ తేదీన నిర్వహించనున్నారు. వేడుకలు సందర్భంగా ఆదివారం పొండవుల జననం ఘట్టం పురస్కరించుకుని పంచపాండవుల విగ్రహాలకు రెండు వేల బిస్కెట్లతో అలంకరించారు. మహా దీపారాధన చేపట్టి వాహనంపై కొలువుదీర్చి పట్టణ వీధుల్లో ఊరేగించారు. మహిళలు కర్పూర హారతులిచ్చి, కొబ్బరికాయలు కొట్టి స్వామిని దర్శించుకున్నారు.
తిరువొత్తియూరు: చైన్నె విమానాశ్రయం దేశీయ టెర్మినల్‌లో ఇండిగో ఎయిర్ ఎయిర్‌లైన్స్ ప్రయాణీకుల విమానం వచ్చి దిగింది. ఆ విమానంలో వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ శాఖ ఎయిర్ ఇంటెలిజెన్స్ విభాగం ప్రత్యేక బృందం రహస్య నిఘా పెట్టింది. అప్పుడు మదురైకు చెందిన 2 ప్రయాణికులు, కన్వేయర్ బెల్ట్‌పై వచ్చిన తమ సూట్‌కేస్, బ్యాగులను తీసుకుని బయటకు వెళ్లడానికి ప్రయత్నించారు. ఆ ఇద్దరి ప్రయాణికులను కస్టమ్స్ శాఖ ఎయిర్ ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానంతో ఆపి, వస్తువులను తెరిచి తనిఖీ చేశారు. వారి వద్ద కట్టలు కట్టలుగా రూ.1.50 లక్షలు భారత నగదు, రూ.33.5 లక్షల విలువైన అమెరికన్ డాలర్ కరెన్సీ నోట్లు మొత్తం రూ.35 లక్షల విలువైన నగదు తీసుకువచ్చినట్లు తెలిసింది. ఆ నగదుకు సరైన పత్రాలు చూపక పోవడంతో ఆ నగదును కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కొరుక్కుపేట: చైన్నె పార్క్ టౌన్ మింట్ స్ట్రీట్ ఉన్న 400 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర ఆలయంలో పంగుణీ మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం ఆలయంలో పిచ్చాండవర్ తోటి ఉత్సవాన్ని ఎస్‌ఎల్ ఎంటర్ ప్రైజెస్ అధినేత ఇమ్మిడి కిషోర్ కుమార్ కుటుంబం వ్యవహరించింది. పిచ్చాండవర్‌కి అభిషేక పూజలను నేత్రపర్వంగా నిర్వహించారు. సాయంత్రం పిచ్చాండవర్ ను విశేషంగా అలంకరించి విశేషపూజలను శాస్త్రోక్తంగా చేపట్టారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే నిర్వహించే ఈ పిచ్చాండవర్ తొట్టి ఉత్సవం కంచి ఏకాంభరేశ్వర ఆలయంలో జరిగే మాదిరిగానే ఇక్కడ నిర్వహించడం విశేషం. పురవీధుల్లో పిచ్చాండవర్ స్వామిని ఊరేగింపు నిర్వహించగా, ఉత్సవంలో నాదస్వరం, బ్యాండ్ మేళం నడుమ వైభవంగా సాగి, ఆధ్యాత్మిక శోభన సంతరించుకుంది . వందలాది మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.


