తిరువళ్లూరు: టీవీకే పూందమల్లి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాశం అలియాస్ కుట్టి తనపై లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా టీవీకే సౌత్ జిల్లా కార్యదర్శి కుట్టి అలియాస్ ప్రకాశం గత సంవత్సరం నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇతడ్ని తిరువళ్లూరు జిల్లా పూందమల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఎస్పీ కార్యాలయానికి పూందమల్లి నియోజకవర్గం తిరువూర్ గ్రామానికి చెందిన సంగీత మణిగండన్ ఫిర్యాదు చేశారు. తనను కుట్టి లైంగికంగా వేధిస్తున్నారని, అతడిపై చర్యలు తీసుకోవడంతో పాటు అధిష్టానం అతడికి ఇచ్చిన సీటును వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన క్రమంలో అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశామని, అయినా అతడికి సీటు ఇవ్వడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. తనకు న్యాయం జరగకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేస్తానని సైతం హెచ్చరించారు. కుట్టిపై రాజకీయ దురుద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన మద్దతుదారులు సైతం పోటాపోటీగా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సంగీత మహిళ విభాగం కార్యదర్శిగా పదవిని ఆశించారని పదవి రాకపోవడంతో లైంగిక ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తప్పుడు ఫిర్యాదు చేసిన సంగీతపై తక్షణం చర్యలు తీసుకోవాలని వారు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.


