సాక్షి, చైన్నె: తమిళనాడులో ఎన్నికల నామినేషన్ల పర్వం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులను అనుసరించాల్సిన నిబంధనలు, ఆంక్షల వివరాలను ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ ప్రకటించారు. రాష్ట్రంలో ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల కోసం సోమవారం నుంచి నామినేషన్లు స్వీకరణకు నియోజకవర్గాలలో రిటర్నింగ్ అధికారులు సిద్ధమయ్యారు.
షెడ్యూల్ ఇలా..
ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఏప్రిల్ 6 నామినేషన్లకు చివరి రోజు. కాగా మహావీర్ జయంతి (మార్చి 31), బ్యాంకు సెలవు (ఏప్రిల్ 1), గుడ్ ఫ్రైడే (ఏప్రిల్ 3), ఆదివారం (ఏప్రిల్ 5) ఉన్నందున, అభ్యర్థులకు కేవలం 4 రోజులు మాత్రమే సమయం నామినేషన్ల దాఖలుకు అందుబాటులో ఉంటుంది. దీంతో తొలి రోజు నుంచి నామినేషన్లు దాఖలుపై అభ్యర్థులు దృష్టి పెట్టే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటికే డీఎంకే తో పాటుగా కూటమిలోని పార్టీలు అనేకం అభ్యర్థులను ప్రకటించాయి. అన్నాడీఎంకే అభ్యర్థులను ప్రకటించగా కూటమిలోని బీజేపీతో పాటూ ఇతర మిత్రులు ప్రకటించాల్సి ఉంది. నామినేషన్ల దాఖలు నిమిత్తం 234 నియోజకవర్గాలలోని రిటర్నింగ్ అధికారుల కార్యాలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులకు ఆంక్షలు, నిబంధనలు విధిస్తూ అర్చనా పట్నాయక్ ప్రకటించారు. అభ్యర్థితో పాటూ ఐదు గురిని మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అనుమతించనున్నారు. ఆన్‌లైన్‌లో సైతం నా మినేషన్ల దాఖలకు అవకాశం కల్పించినా, వాటి నకలును రిటర్నింగ్ అధికారులకు సమర్పించాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. రిటర్నింగ్ అధికారి కార్యాలయ పరిసరాలలో భద్రతా పరంగా చర్యలు చేపట్టారు. అలాగే 2,106 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు నిఘాతో వ్యవహరించడమే కాకుండా, నామినేషన్ కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాలతో నిఘా పెంచారు.


