అన్నాడీఎంకే మాజీల హవా | - | Sakshi
Sakshi News home page

అన్నాడీఎంకే మాజీల హవా

Mar 30 2026 8:37 AM | Updated on Mar 30 2026 8:37 AM

● 19 స్థానాల్లో వారే కీలకం

డీఎంకే జాబితాలో

సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార డీఎంకే ప్రకటించిన అభ్యర్థుల జాబితా పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. ముఖ్యంగా అన్నాడీఎంకే నుండి డీఎంకేలోకి వలస వచ్చిన నేతలకు పెద్దపీట వేయడం గమనార్హం. గతంలో అన్నాడీఎంకేలో కీలక బాధ్యతలు నిర్వర్తించి, రకరకాల కారణాలతో డీఎంకేలో చేరిన 19 మందికి ఈసారి పోటీ చేసే అవకాశం కల్పించారు. అత్యధికంగా అన్నాడీఎంకే నేపథ్యం ఉన్నవారికే ప్రాధాన్యత లభించింది. ఇటీవల పార్టీ మారిన ఓ. పన్నీర్‌ సెల్వంకు బోడి నాయకనూరు, వైద్యలింగంకు ఒరత్తనాడు, మనోజ్‌ పాండియన్‌కు ఆళంకులం సీట్లు ఇచ్చారు. అలాగే కోయంబత్తూర్‌ దక్షిణం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న మాజీ మంత్రి సెంథిల్‌ బలాజీ, తిరువణ్ణామలైలో పోటీ చేస్తున్న మంత్రి ఏవీ వేలు, ఈరోడ్‌ వెస్ట్‌లో పోటీ చేస్తున్న ముత్తుస్వామి,చైన్నె హార్బర్‌ బరిలో ఉన్న మంత్రి శేఖర్‌ బాబు, తిరుచెందూర్‌ రేసులో ఉన్న మంత్రి అనితా రాధాకృష్ణన్‌, తిరుమయంలో పోటీ చేస్తున్న మంత్రి రఘుపతి, విల్లుపురంలో పోటీచేస్తున్న లక్ష్మణన్‌, హోసూరు అభ్యర్థి సత్యలు ఒకప్పుడు అన్నాడీఎంకే నుంచి డీఎంకేలోకి వచ్చిన వారే కావడం గమనార్హం. ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేస్తున్న తమను పక్కన పెట్టి, ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి మంత్రి పదవులతో పాటు తాజాగా మళ్లీ ఎన్నికల్లోనూ ప్రాధాన్యత ఇవ్వడంపై డీఎంకే సీనియర్లు పలువురు పెదవి విప్పుతున్నట్టు సమాచారం. ఈ ’వలస నేతల’ వ్యూహం డీఎంకేకు ఎంతవరకు కలిసి వస్తుందో వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement