తిరువళ్లూరు: సోలీశ్వరుడి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు ఉదయం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ పేరంబాక్కంలో సోలీశ్వరుడు సమేత కామాక్షి అమ్మవారి ఆలయం వుంది. ఆలయంలో ప్రతి ఏటా పంగుణి మాసంలో ఉత్సవాలను పది రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే ఉత్సవాలు గత 22న ధ్వజారోహణంతో ప్రారంభించారు. ఏడవ రోజు శనివారం ఉదయం స్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయం నుంచి బయలుదేరిన ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత రథానికి చేరుకుని భక్తులకు దర్శనమిచ్చారు. రథోత్సవంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.


