సాక్షి, చైన్నె: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శి, కమిషనర్, ఏడీజీపీ తదితర 10 మంది అధికారులను బదిలీ చేయాలని టీవీకే అధినేత విజయ్ పట్టుబడుతున్నారు. పది కారణాలను ఎత్తి చూపుతూ శనివారం ఆయన ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్‌కు ఫిర్యాదు చేశారు. ప్రపథమంగా ఆయన తాజాగా సచివాలయంలో అడుగు పెట్టారు. వివరాలు.. తమిళనాడులో అధికార డీఎంకే కూటమి, ప్రదాన ప్రతిపక్షం అన్నాడీఎంకే కూటమి ఎన్నికల కార్యాచరణలో దూసుకెళ్తున్నాయి. అయితే టీవీకే అధినేత విజయ్‌కు అడుగడుగున అడ్డంకులు తప్పడం లేదు. ప్రచారాలకు సైతం అనుమతులు దక్కక పోవడంతో తీవ్ర అసహనానికి విజయ్ లోనయ్యారు. శనివారం జరగాల్సిన కార్యక్రమాన్ని ఆదివారం వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనుమతుల జారీ విషయంలో ఎన్నికల కమిషన్ వర్గాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని స్వయంగా విజయ్ ఆవేదనను సైతం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ అనుమతుల వివాదం నేపథ్యంలో తన అభ్యర్థులను ఆదివారం చైన్నె నుంగంబాక్కంలోని ఓ స్టార్ హోటల్ వేదికగా ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. తమిళనాడుకు చెందిన 234 మంది, పుదుచ్చేరికి చెందిన 30 మంది అభ్యర్థులను విజయ్ పరిచయం చేయనున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. తొలిసారిగా ఎన్నికల రేసులో ఉన్న విజయ్ పార్టీ జాబితా, మేనిఫెస్టోపై ఎదురు చూపులు పెరిగాయి.
ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు..
పెరంబూరు నుంచి ఎన్నికల ప్రచారానికి విజయ్ కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. అయితే అనుమతి అన్నది ఇంత వరకు దక్కలేదు. ఈ పరిస్థితులలో ఆయన శనివారం మధ్యాహ్నం తన కార్యాలయం నుంచి సచివాలయానికి వచ్చారు. ప్రపథమంగా ఆయన సచివాలయంలో అడుగు పెట్టి, ఇక్కడున్న ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్‌ను స్వయంగా కలిసి ఫిర్యాదు పత్రం సమర్పించారు. పెరంబూరులో తన ఎన్నికల ప్రచారానికి అధికారులు అనుమతి నిరాకరించడంపై విజయ్ అందులో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన ఫిర్యాదులో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు.
సచివాలయానికి వస్తున్న విజయ్
పక్షపాత ధోరణి తగదు
ప్రభుత్వ అధికారులు అధికార పార్టీ అయిన డీఎంకేకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విజయ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చైన్నె పోలీస్ కమిషనర్, ఏడీజీపీ, ఆర్థిక శాఖ కార్యదర్శి సహా మొత్తం 10 మంది కీలక ఉన్నతాధికారులను తక్షణమే ఎన్నికల విధుల నుండి మార్చాలని ఆయన కోరారు. తనకు ప్రచార అనుమతులు నిరాకరించడం వెనుక ఉన్న రాజకీయ కోణాలను వివరిస్తూ, తన ఫిర్యాదులో 10 కారణాలను ఆయన సుదీర్ఘంగా వివరించారు. ఎన్నికల సమయంలో తమ పార్టీకి సమాన అవకాశాలు కల్పించాలని, అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని విజయ్ ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్‌ను కోరారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ విజయ్ నేరుగా రంగంలోకి దిగి అధికారులపైనే ఫిర్యాదు చేయడం తాజాగా హాట్ టాఫిక్‌గా మారింది.


