సాక్షి, చైన్నె: అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ శనివారం ప్రకటించారు. గతంలో అన్నాడీఎంకేలో మంత్రులుగా వ్యవహరించిన ఇద్దరు మాజీలకు తన పార్టీ తరపున అవకాశం కల్పించారు. వివరాలు.. అన్నాడీఎంకే – బీజేపీ ఎన్‌డీఏ కూటమిలో అమ్మమక్కల్ మున్నేట్ర కళగంకు 11 సీట్లను కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో తన పార్టీ తరపున పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితా కసరత్తులను పూర్తి చేసిన టీటీవీ దినకరన్ శనివారం ఉదయం చైన్నెలో విడుదల చేశారు. ఈ జాబితాలో పార్టీ సీనియర్ నేతలు జి. సెంతమిళన్ , సి. షణ్ముగవేల్ గతంలో అన్నాడీఎంకే హయాంలో మంత్రులుగా వ్యవహరించారు. అన్నాడీఎంకే నుంచి దినకరన్ బయటకు వచ్చినానంతరం ఆయనకు వెన్నంటి ఉంటూ వచ్చారు. దీంతో ఈ ఇద్దరికి పోటీ చేసే అవశాన్ని టీటీవీ దినకరన్ కల్పించారు.
11 మంది అభ్యర్థులు
తిరువయ్యారు– వి. వేలు కార్తికేయన్, కారైక్కుడి – వి. పాండియ, నాంగునేరి – ఆర్. ఇసక్కి ముత్తు, ఒట్ట పిడారం – ఆర్. సుందర్ రాజన్, సైదాపేట – జి. సెంతమిళన్, తిరుపత్తూరు – జ్ఞాన శేఖరన్, మన్నార్‌కుడి – ఎస్. కామరాజ్, పూందమల్లి – ఏలుమలై, పెరియకుళం –కె. కదిర్‌గామం, మడత్తుకుళం – సి. షణ్ముగ వేల్, తిరుచ్చి వెస్ట్ – ఎం. రాజశేఖరన్ పోటీ చేయనున్నారు.
కుక్కర్ గుర్తుపై పోటీ
టీటీవీ దినకరన్‌మాట్లాడుతూ ప్రజలు డీఎంకేకు వ్యతిరేకంగా నిశ్శబ్ద విప్లవం సృష్టించనున్నారని వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం రూపంలో రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయని, వీటిని తొలగించి ఎన్డీయే కూటమి అధికారాన్ని చేపట్టబోతోందన్నారు. తాము ’కుక్కర్’ గుర్తుపైనే పోటీ చేస్తున్నామన్నారు.


