సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికలలో సినీ నటుడు, దర్శకుడు సుందర్ సీ పోటీ చేయనున్నారు. ఏసీ షణ్ముగం నేతృత్వంలోని పుదియ నీతి కట్చి తరపున ఆయన మదురై సెంట్రల్ నియోజకవర్గం రేసులో దిగనున్నారు. ఈ వివరాలను ఏసీ షణ్ముగం శనివారం ప్రకటించారు. సినీ నటి కుష్భు బీజేపీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షురాలి పదవిలో ఉన్నారు. 2021లో ఆమె చైన్నె థౌజండ్ లైట్స్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజాగా ఆమె భర్త, ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు నిర్మాత సుందర్ సీ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఆయన ఏ.సి. షణ్ముగం పుదియ నీతి (న్యూ జస్టిస్ పార్టీ) పార్టీ తరపున పోటీ చేయనున్నారు. ఈ పార్టీ అన్నాడీఎంకే, బీజేపీ కూటమిలో ఉంది. ఈ పార్టీకి బీజేపీ ఒక సీటు, అన్నాడీఎంకే ఒక సీటు కేటాయించింది. అన్నాడీఎంకే తరపున కేటాయించిన సీటుకు సుందర్ సీని అభ్యర్థిగా ఏసీ షణ్ముగం ఎంపిక చేయడం విశేషం.
రెండాకుల గుర్తుపై..
మదురై సెంట్రల్ నియోజకవర్గం నుంచి సుందర్ సీ పోటీ చేస్తారని ఏసీ షణ్ముగం ప్రకటించడం గమనార్హం. అయితే, అన్నాడీఎంకే రెండాకుల చిహ్నంపై సుందర్ సీ పోటీ చేయనున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమిలో తమ పార్టీకి కేటాయించిన మదురై సెంట్రల్ స్థానం నుండి చిదంబరం పిళ్లై కుమారుడు, ప్రముఖ సినీ నటుడు సుందర్ సీని అభ్యర్థిగా నిలబెడుతున్నందుకు సంతోషిస్తున్నానని ఏషీ షణ్ముగం వ్యాఖ్యానించారు. మదురై సెంట్రల్ స్థానంతో పాటు పుదియ నీతి కట్చికి కేటాయించిన మరో నియోజకవర్గం అభ్యర్థిని అఽధికారికంగా సోమవారం అధికారికంగా ప్రకటిస్తామన్నారు. తాజాగా సుందర్ సీ రేసులోకి రావడంతో మదురై సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారనుంది. త్వరలోనే అభ్యర్థిని అధికారికంగా ప్రజలకు పరిచయం చేయనుండడానికి ఏసీ షణ్ముగం సన్నద్ధం అవుతున్నారు. కాగా ఇదే నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థిగా ఉన్న మంత్రి పీటీఆర్ పళణి వేల్ త్యాగరాజన్‌ను సుందర్ సీ ఢీకొట్టాల్సి ఉంది.


