ఏఆర్ రెహమాన్, ప్రభుదేవా
సాక్షి, చైన్నె: చైన్నె సమీపంలోని తండలంలో ఉన్న రాజలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో 18 వేల మందితో విద్యార్థులతో రీఛార్జ్ 2026 వేడుక సందడి వాతావరణంలో జరిగింది. సరికొత్త చర్రితను సృష్టించే విధంగా కళలు, సంగీత సంబరాలు హోరెత్తాయి. సాంస్కృతిక ఉత్సవంగా భారతీయ కళాశాలల చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచే విధంగా రెండు రోజుల వేడుక జరిగింది. తొలిసారి కాలేజీ క్యాంపస్‌లో సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ లైవ్ షోను విజయవంతంగా నిర్వహించారు. అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చే రెహమాన్ తొలిసారిగా ఒక కాలేజీ క్యాంపస్‌లో నేరుగా లైవ్ కాన్సర్ట్ నిర్వహించడం విశేషం. ఆయనతో పాటు గాయనీ, గాయకులు శ్వేతా మోహన్, రక్షితా సురేష్, హరిచరణ్, ఏఆర్ అమీన్ వంటి వారు విద్యార్థులలలో ఉత్సాహాన్ని నింపే విధంగా పాటలను హోరెత్తించారు. రెండో రోజుగా నటుడు, దర్శకుడు, డ్యాన్స్‌మాస్టర్ ప్రభుదేవా తన బృందంతో డ్యాన్స్ షోతో సందడి చేశారు. సినీ తారలు శ్రియా శరణ్, సయేషా, నిక్కీ గల్రానీ వంటి వారి నృత్య ప్రదర్శనలు కనుల పండువగా జరిగాయి. ఈ చారిత్రాత్మక క్షణం గురించి రాజలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజీ వైస్ చైర్మన్ అభయ్ మేఘనాథన్ మాట్లాడుతూ భారతదేశంలోని కాలేజీ కల్చరల్ ఈవెంట్స్‌లో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టంగా పేర్కొన్నారు. ఏఆర్ రెహమాన్ వంటి దిగ్గజాన్ని తమ క్యాంపస్‌కు ఆహ్వానించడం, తమ విద్యార్థులకు సాటిలేని అనుభవాన్ని అందించాలన్న నిబద్ధతకు నిదర్శనంగా పేర్కొన్నారు. రీఛార్జ్ –2026 నూతన ఆవిష్కరణలు, ప్రతిభను చాటి చెప్పినట్టు వివరించారు.


