– రాందాసుకు షాక్
సాక్షి, చైన్నె : మామిడి పండు చిహ్నం వ్యవహారంలో పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసుకు చుక్కెదురైంది. ఆయన విజ్ఞప్తిని కోర్టు పరిగణించలేదు. పిటిషన్‌ను చైన్నె సివిల్ కోర్టు గురువారం కొట్టి వేసింది. దీంతో మామిడి పండు అన్బుమణి వశం చేరినట్టుగా పరిస్థితి నెలకొంది. పీఎంకేలో రాందాసు, ఆయన తనయుడు అన్భుమణి మధ్య సమరం గురించి తెలిసిందే. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ అన్బుమణి పార్టీ అధ్యక్షుడిగా గుర్తించి, జెండా, చిహ్నం ఆయనకు అప్పగించింది. దీనిని వ్యతిరేకిస్తూ రాందాసు న్యాయపోరాటం చేస్తూ వస్తున్నారు. చివరకు సుప్రీం కోర్టు ఆదేశాలతో చైన్నె 12వ అదనపు సివిల్ కోర్టు తలుపు తట్టారు. బుధ, గురువారం ఈ విచారణ జరిగింది. న్యాయమూర్తి ధర్మప్రభు స్పందిస్తూ రాందాసు విన్నపాన్ని తిరస్కరించారు.
కీలకంగా ఎన్నికల కమిషన్ వాదన
విచారణకు హాజరైన ఎన్నికల కమిషన్ తరపున న్యాయవాదులు కోర్టు ముందు బలమైన వాదనలు వినిపించారు. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ఈ దశలో చిహ్నాన్ని సీజ్ చేస్తే ఓటర్లలో గందరగోళం ఏర్పడుతుందని సూచించారు. పుదుచ్చేరిలో ఇప్పటికే ఈ చిహ్నాన్ని కేటాయించినట్లు తెలిపారు. ఈ వివాదం పూర్తిగా తండ్రి, కుమారుల మధ్య వ్యక్తిగత అంశం అని వివరించారు. అదే సమయంలో అన్బుమణి అధ్యక్షుడైన తర్వాతే పార్టీ గుర్తింపు రద్దయినట్లు రాందాసు తరపున వాదించారు. అలాగే, అన్బమణి తరపున సైతం వాడీవేడిగా వాదనలు జరిగాయి. రాందాస్‌ను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని , పార్టీ చిహ్నం వేరే ఎవరికీ వెళ్లకుడదనే ఉద్దేశంతోనే తాను దానిని పొందినట్లు తెలిపారు. 2025లో రాందాస్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారని చెబుతున్న జనరల్ బాడీ సమావేశం చెల్లదని స్పష్టం చేశారు. చివరకు న్యాయమూర్తి స్పందిస్తూ, ఎన్నికల సంఘం నిర్ణయాల్లో కోర్టులు తలదూర్చలేవని, పైగా చిహ్నం వ్యక్తులకు కాకుండా పీఎంకే అనే పార్టీ పేరు మీద కేటాయించ బడి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ విచారణ యోగ్యం కాదని తిరస్కరించారు. దీంతో పార్టీ, చిహ్నం అన్భుమణి వశం అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. తాజా పరిణామంపై అప్పీలుకు వెళ్లాలా? లేదా ప్రత్యామ్నాయం మీద దృష్టి పెట్టాలా? అన్న డైలమాలో రాందాసు వర్గం నిమగ్నమైంది.


