ఇండియా కూటమి.. చిన్నా భిన్నం | - | Sakshi
Sakshi News home page

ఇండియా కూటమి.. చిన్నా భిన్నం

Mar 27 2026 8:55 AM | Updated on Mar 27 2026 8:55 AM

● పుదుచ్చేరిలో రసవత్తర రాజకీయం ● ఎవరికి వారే అనేలా బరిలో నేతలు ● వీసీకే మూడు చోట్ల పోటీ

సాక్షి, చైన్నె: పుదుచ్చేరి ఇండియా కూటమి రాజకీయం రసవత్తరంగా మారింది. కూటమి చిన్నా భిన్నమైనట్టుగా పరిస్థితి నెలకొంది. కూటమిలోని పార్టీల తరపున ఎవరికి వారు నామినేషన్లు దాఖలు చేసుకుని, ఎన్నికలలో పోటీ దిశగా ప్రచారంలో ఉరకలు తీస్తుండటం చర్చకు దారి తీసింది. ఆది నుంచి కేంద్ర పాలిత పుదుచ్చేరిలోని డీఎంకే, కాంగ్రెస్‌, వీసీకే తదితర ఇండియా కూటమి వివాదాలు కొనసాగుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఎట్టేలకు కాంగ్రెస్‌ 16 చోట్ల, డీఎంకే 14 చోట్ల పోటీకి నిర్ణయించాయి. అయితే, సర్దుబాటు జాప్యంతో గడువు ముగియడంతో 30 స్థానాలలోనూ కూటమిలోని పార్టీలు నామినేషన్లు దాఖలు చేశాయి. తాజాగా కూటమి పార్టీలకు కేటాయించిన స్థానాలలో నామినేషన్లు వేసిన వాళ్లు ఉపసంహరించుకోకుండా మారం చేయడం వివాదానికి దారి తీసింది.

డీఎంకేకు చిక్కులు..

డీఎంకేకు చెందిన ఐదు స్థానాలలో కాంగ్రెస్‌ వర్గాలు నామినేషన్లు వేశాయి. అలాగే వీసీకేకు డీఎంకే కేటాయించిన ఓ స్థానంలోనూ కాంగ్రెస్‌ తరపున నామినేషన్లు పడ్డాయి. కాంగ్రెస్‌ నాయకులు నామినేషన్లు ఉపసంహరించుకోక పోవడంతో రాజకీయ రసవత్తరంగా మారి, కూటమి చిన్నాభిన్నం అన్నట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, కాంగ్రెస్‌ పోటీ చేస్తున్న స్థానాలలో డీఎంకే తరపున నామినేషన్లు వేసిన వారికి బీ ఫామ్‌లను డీఎంకే ఇవ్వక పోవడం గమనార్హం. అయితే, అస్సలు సమస్య అంతా కాంగ్రెస్‌ అభ్యర్థులు డీఎంకే స్థానాలలో నామినేషన్లు ఉపసంహరించుకోక పోవడమే ప్రధాన కారణంగా మారింది.ప్రస్తుతం డీఎంకేకు కేటాయించిన కాలాపట్టు, రాజ్‌భవన్‌, నెల్లితోపు, మంగళం, తిరిభువనై వంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. అధిష్టానం ఆదేశించినా ఈ నేతలు తగ్గకుండా ప్రచారంలో పరుగులు తీస్తున్నారు. అయితే, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి గురువారం నెల్లితోపు నియోజకవర్గ అభ్యర్థి ఆనందబాబు మాత్రమే నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు.

ఎవరికి వారే..

ఇప్పటికే కూటమి నుంచి వైదొలగిన సీపీఐ తట్టాన్‌ చావడి, ఉలవర్కర్‌నియోజకవర్గాలలో రెండు చోట్ల నామినేషన్లు దాఖలు చేసి పోటీలో నిమగ్నమైంది. అలాగే సీపీఎం నాలుగు స్థానాల్లో అభ్యర్థులను పోటీలో పె ట్టింది. ఇక, తాజాగా వీసీకే సైతం అదేబాటను అనుసరించింది. సర్దుబాటు గందరగోళం నేపథ్యంలో కూటమి ఒప్పంద ఉల్లంఘనకు సిద్ధమయ్యాయి. తమకు కేటాయించిన ఉలవర్కరైలో కాంగ్రెస్‌ అభ్యర్థి పోటీ చేయడంతో వీసీకే నేత తిరుమావళవన్‌ కన్నెర్ర చేశారు. ఉళవర్కరై, ఊసుడు, నెట్టపాక్కం నియోజకవర్గాలలో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని గురువారం ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిన నేపథ్యంలో తిరుగుబాటు అభ్యర్థుల బెడద డీఎంకేకు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ పరిస్థితుల్లో వీసీకే నేత తిరుమావళవన్‌ తన ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లు వెనక్కు తీసుకోకుండా పోటీలో ఉన్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్‌పై ఆగ్రహంతో తిరుమావళవన్‌ ఈ ప్రకటన చేశారు. కూటమి ధర్మాన్ని కాంగ్రెస్‌ పాటించడం లేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ పోటీలో ఉన్న నియోజకవర్గంలో తమ అభ్యర్థులు పోటీలో ఉంటారని ప్రకటించారు. ఈ మేరకు ఉళవర్కరై – సెల్వ పుష్పలత, ఊసుడు–అరిమా తమిళన్‌, నెట్టపాక్కంలో అముదన్‌ పోటీ చేస్తారని ప్రకటించారు. కాంగ్రెస్‌ మొండి వైఖరి వల్లే పుదుచ్చేరిలో కూటమి చిన్నాభిన్నంగా మారే పరిస్థితి నెలకొందన్న ఆగ్రహం నెలకొంది. అదే సమయంలో తిరుగుబాటు దారులను బుజ్జగించి ఫ్రెండ్లీ ఫైట్‌ దిశగా కాంగ్రెస్‌ కుస్తీలు పట్టే పనిలో నిమగ్నమైంది. ఇక, అధికార ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ను తొమ్మిది చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులు ఈ ఎన్నికలలో ప్రత్యక్షంగా ఢీ కొడుతుండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement