ఉత్సవాలకు ఘనంగా ధ్వజారోహణం
సాక్షి, చైన్నె: పళని మురుగన్ ఆలయంలో పంగుణి ఉత్తరం ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యారు. ఉత్సవాలకు ఘనంగా ధ్వజారోహణం చేశారు. తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, అరుపడై వీడులలో మూడవదైన పళని దండాయుధపాణి స్వామి ఆలయంలో పంగుణి ఉత్తరం ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.ఇందులో భాగంగా గురువారం వేకువ జాము నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాదికార్యక్రమాలు జరిగాయి.
ఉత్సవాలకు ధ్వజారోహణం
గురువారం ఉదయం 10 గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ధ్వజస్తంభంపై పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా స్వామివారికి, వినాయకుడికి, ఇతర పరివార దేవతలకు ప్రత్యేక కాపు (రక్షాబంధనం) కట్టారు. ఉత్సవాల్లో భాగంగా ముత్తుకుమారస్వామి, వల్లి, దైవానై అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, అలంకారాలు నిర్వహించారు. స్వామి , అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు.ఈ10 రోజుల వేడుకల్లో స్వామివారు కామధేనువు, వెండి ఏనుగు, బంగారు గుర్రం వంటి వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. ఈనెల 31వ తేదీ రాత్రి 7 గంటలకు స్వామివారి తిరుకల్యాణం, అనంతరం రాత్రి 9 గంటలకు వెండి రథంపై ఊరేగింపు వేడుక జరగనుంది. ఉత్సవాల్లో అత్యంత కీలకమైన మహా రథోత్సవం ఏప్రిల్ 1వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు గిరి వీధుల్లో జరుగుతుంది.
భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
ఈ ఉత్సవం సందర్భంగా వేలాది మంది భక్తులు ఈరోడ్ జిల్లా కొడుముడి కావేరీ నది నుండి పవిత్ర తీర్థాన్ని కావడిలో తీసుకువచ్చి స్వామివారికి అభిషేకం చేస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మార్చి 31 నుండి ఏప్రిల్ 2 వరకు (3 రోజులు) ప్రత్యేక దర్శన టికెట్లను రద్దు చేశారు. వీఐపీలు, వీవీఐపీలు సైతం ఒకే వరసులో వెళ్లి స్వామి వారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. కావడి తీసుకువచ్చే భక్తుల కోసం రోజుకు 20,000 మందికి చొప్పున, మొత్తం 10 రోజులు 2 లక్షల మందికి అన్నదాన సౌకర్యం కల్పించారు.


