సాక్షి, చైన్నె : ప్రజలకు ఉచిత పథకాలను ఆశగా చూపే రాజకీయ పార్టీలు, రాష్ట్రంలో మద్యపానాన్ని పూర్తిగా అడ్డుకుంటామని ఎందుకు ప్రకటించడం లేదు? అని నామ్ తమిళర్ కట్చి సమన్వయకర్త సీమాన్ ప్రశ్నించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణగిరి జిల్లాలోని ఊత్తంగరై, కృష్ణగిరి, వేపనపల్లి నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న నామ్ తమిళర్ కట్చి అభ్యర్థులకు మద్దతుగా ఆయన గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీమాన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మార్పు రావాలని కోరుకునే పార్టీలు కేవలం ఉచిత పథకాలకే పరిమితమవుతున్నాయని వివరించారు. మద్యపానం వలన నేరాలు పెరుగుతున్నాయని, ఆరేళ్ల చిన్నారి నుంచి అరవై ఏళ్ల వృద్ధురాలి వరకు మహిళలపై లైంగిక దాడులు పెరగడానికి మద్యం ప్రధాన కారణమవుతోందని ధ్వజమెత్తారు. ఉచితాల పేరుతో స్థానిక ప్రజలను సోమరులుగా తయారు చేసి, ఉత్తర భారతదేశం నుండి పనివారిని ఇక్కడికి తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ ద్వారా సుమారు ఒకటిన్నర కోట్ల మంది ఉత్తర భారతీయులకు ఓటు హక్కు కల్పించి ఉన్నారని ఆరోపించారు. ఈదృష్ట్యా, భవిష్యత్తులో ఇక్కడి రాజకీయ అధికారాన్ని వారే నిర్ణయించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే భాష, చరిత్ర, భూములను తమిళులు కోల్పోతున్నామని, మున్ముందు రాజకీయ అధికారాన్ని కూడా పరాయి వారికి అప్పగిస్తే, దేశాన్ని విడిచి వెళ్లడం తప్ప మరో మార్గం ఉండదని హెచ్చరించారు. రాష్ట్రంలోని కొండలను, ఖనిజ సంపదను యథేచ్ఛగా దోచుకుంటున్నారని , ప్రకృతిని సర్వనాశనం చేస్తున్న పార్టీలను ఈ ఎన్నికలలో బహిష్కరించాలని పిలుపు నిచ్చారు.
ఒంటరి పోరాటం
తమిళ నేలపై ప్రేమ ఉన్నవారే ఈ సమస్యలను పరిష్కరించగలరని, అందుకే ఎన్నిసార్లు ఓడిపోయినా, సిద్ధాంతాలకు విరుద్ధమైన పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా నామ్ తమిళర్ కట్చి ఒంటరిగానే పోటీ చేస్తోందన్నారు. తాను ఇప్పుడు చెప్పేటప్పుడు అర్థం కాకపోవచ్చు అని, అయితే, సమస్య అన్నది నెత్తి మీదకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అర్థమవుతుంది‘ అని సీమాన్ పేర్కొన్నారు.


