సాక్షి, చైన్నె : సీట్ల ఖరారు నేపథ్యంలో నియోజకవర్గాల ఎంపిక విషయంలో డీఎంకే కూటమి పార్టీలు కుస్తీలు పడుతున్నాయి. డీఎంకే కమిటీకి తాము ఆశిస్తున్న నియోజకవర్గాల జాబితాను గురువారం ఆయా పార్టీలు అందజేశాయి. డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌కు 28, డీఎండీకేకు 10, వీసీకేకు 8, ఎండీఎంకేకు 4, సీపీఎం 5, సీపీఐ 5, ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ 2, మనిదనేయమక్కల్ కట్చి 2, కొంగు దేశీయ కట్చి 2 సీట్లు కేటాయించారు. చిన్న పార్టీలకు తలా ఓ సీటు ఇచ్చారు. మిత్రులకు కేటాయింపు పోగా డీఎంకే ఉదయ సూర్యుడి చిహ్నంలో 175 నియోజకవర్గాలలో అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఈపరిస్థితులో వారి వారి సంఖ్యకు అనుగుణంగా తాము ఆశిస్తున్న నియోజకవర్గాల వివరాలను గురువారం అన్నా అరివాలయంలో మిత్ర పక్షాల నాయకులు,కమిటీల ప్రతినిధులు డీఎంకే కోశాధికారి టీఆర్‌బాలు నేతృత్వంలోని కమిటీకి అందజేశాయి. కాంగ్రెస్ అయితే, 35 నియోజకవర్గాలతో, డీఎండీకే 15, వీసీకే, సీపీఎం, సీపీఐలు పది నియోజకవర్గాలతో జాబితాలను అందజేశాయి. వీటిని సమగ్రంగా పరిశీలించి శుక్రవారం ఎవ్వరెవ్వరికి ఏఏ నియోజకవర్గం అన్న విషయాన్ని డీఎంకే ప్రకటించనుంది. ఇదిలా ఉండగా, డీఎంకే మేనిఫెస్టో రూపకల్పన సిద్ధం చేశారు. అభ్యర్థుల జాబితాను సైతం పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ సిద్ధం చేసినట్టు అన్నా అరివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. ఏప్రిల్ 2వ తేదీన తిరువారూర్ నుంచి స్టాలిన్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టే విధంగా షెడ్యూల్ రూపకల్పన చేసినట్టుగా చెబుతున్నారు.


