సాక్షి, చైన్నె : మూడు సంవత్సరాల వ్యవధిలో చైన్నెలోని ఎంజీఎం హెల్త్ కేర్ అతిపెద్ద ఇంటైస్టెనల్ రిహాబిలిటేషన్ – ట్రాన్స్‌ప్లాంట్ (పేగు పునరావాసం , మార్పిడి) ప్రోగ్రామ్‌ను విజయవంతం చేసింది. 40కి పైగా పేగు మార్పిడి చికిత్సలు జరగ్గా, ఒక్క 2025లోనే 21 చికిత్సలు పూర్తి చేసి అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక వార్షిక రికార్డును నెలకొల్పింది. ఈ వివరాలను గురువారం ఆస్పత్రి డాక్టర్ అనిల్ వైద్య బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా వారు వివరిస్తూ, అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ నుండి తిరిగి వచ్చిన ప్రముఖ వైద్యులు ప్రొఫెసర్ డాక్టర్ అనిల్ వైద్య నేతృత్వంలో ఈ విభాగం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇక్కడ చికిత్స పొందిన రోగులలో 98 శాతం మంది కృత్రిమ ఆహారం అవసరం లేకుండా, సహజంగా ఆహారాన్ని గ్రహించే స్థాయికి చేరుకున్నట్టు తెలిపారు. హోమ్ బేస్డ్, డోర్బిమెక్స్,బ్యాక్ టు బేస్‌విధానంతో దూసుకెళ్తూ ట్రాన్స్‌ప్లాంట్ ఆంకాలజీ విభాగాన్ని కూడా ప్రారంభించామన్నారు. ‘పేగు మార్పిడి అనేది వైద్య శాస్త్రంలో అత్యంత క్లిష్టమైన ప్రక్రియ అని, చైన్నెని ఈ విభాగంలో గ్లోబల్ రిఫరెన్స్ పాయింట్‌గా మార్చడం గర్వంగా ఉందన్నారు. ఇది కేవలం శస్త్రచికిత్స గురించి మాత్రమే కాకుండా, ఇన్ఫెక్షన్ కంట్రోల్ నుండి ఇంటి వద్ద సంరక్షణ వరకు ఒక పూర్తి వ్యవస్థను నిర్మించడం వలననే సాధ్యమైందన్నారు. అధునాతన వైద్య సేవలు కేవలం పాశ్చాత్య దేశాలకే పరిమితం కాదని, చైన్నెలోనూ ఇప్పుడు ఈ రంగంలో ప్రపంచానికే దిశానిర్దేశం చేస్తున్నట్టు ధీమా వ్యక్తం చేశారు.


