కొరుక్కుపేట: కన్యకాపరమేశ్వరి మహిళా కళాశాల విద్యార్థినిలు సృజనాత్మకతను చాటుకున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు నమూనాలు, భాషా సంస్కృతులను తెలిపే నమూనాలు, ఏఐ ప్రాముఖ్యతను చాటే నమూనాలు, వినూత్న సాంకేతిక ఆవిష్కరణలు, విద్యాఅంశాలతో కూడిన నమూనాలను ప్రదర్శించారు. వివరాలు.. తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో 50వ వార్షిక పర్యాటన ప్రదర్శన చైన్నె ఐలాండ్ గ్రౌండ్స్ జరుగుతుంది. అందులో ఈనెల 24,25,26 తేదీల్లో నిర్వహిస్తున్న విద్యా ప్రదర్శనలో కన్యకాపరమేశ్వరి మహిళా కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే విధంగా రూపొందించిన మోడల్స్ అందరినీ అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే పర్యావరణ పరిరక్షణ, సాంకేతిక అభివృద్ధి, విద్యా రంగానికి సంబంధించిన అంశాలపై విద్యార్థులు సృజనాత్మక నమూనాలను రూపొందించారు. కొంతమంది విద్యార్థులు పెన్సిల్ ఆర్ట్, క్రాఫ్ట్ ఐటమ్స్, ఇతర చేతి వృత్తులను తయారు చేసి ప్రదర్శించారు. ముఖ్యంగా తమిళనాడు సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించే విధంగా తిరువళ్లువర్ విగ్రహం, వళ్లువర్ కోట్టం వంటి చారిత్రక నిర్మాణాల నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే ఆధునిక సాంకేతికత అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు సంబంధించిన నమూనాలు కూడా కొలువుదీర్చారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు కేవలం మోడల్స్ మాత్రమే కాకుండా, వివిధ గేమ్స్, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా సందర్శకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ట్రేడ్ ఫేర్ ఇన్‌చార్జి కృష్ణమూర్తి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వనజా, అధ్యాపకులు డాక్టర్ పి.ఎస్.మైథిలి, విద్యార్థినులు పాల్గొన్నారు.


