సాక్షి, చైన్నె : నెలవంక కన్పించడంతో శనివారం రంజాన్ పండుగను జరుపుకునేందుకు రాష్ట్రంలోని ముస్లింలు సిద్ధమయ్యారు. ప్రత్యేక ప్రార్థనలకు మసీదులు ముస్తాబయ్యాయి. ముస్లింలు అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో పండుగ సందడి నెలకొంది.
రంజాన్ మాసంలో నరక ద్వారాలు మూసుకుని, స్వర్గ ద్వారాలు తెరచుకుంటాయన్నది ముస్లింల నమ్మకం. అందుకే పాపకర్మల నుంచి విముక్తి పొండడానికి ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఈ మాసంలో ఉపవాస దీక్షల్ని ఆచరించారు. ధాన ధర్మాలు, సత్కార్యాలు చేస్తూ ఈద్‌ముబార్ వేళకు సిద్ధమయ్యారు.
పండగ సందడి
శుక్రవారం రాత్రి ఆకాశంలో నెలవంక కనిపించడంతో శనివారం పండుగను జరుపుకునే విధంగా ప్రభుత్వ ఖాజీ ప్రకటించారు. దీంతో ముస్లింలు మసీదుల వద్ద ఆనందాన్ని పంచుకున్నారు. శుక్రవారం మసీదులలో ప్రత్యేక ప్రార్ధనలకు ముస్లింలు పోటెత్తారు. పండుగ రోజు ప్రత్యేక ప్రార్థనల కోసం టోపీలు, అత్తరు, బిర్యానీ, తిపి పదార్థాల తయారీకి ఉపయోగించే వస్తువుల కొనుగోళ్ల నిమిత్తం షాపింగ్ సెంటర్లకు తరలి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల ఈద్గా మైదానాల్లో మరికొన్ని మసీదుల్లో ప్రార్థనలు జరగనున్నాయి. రాష్ట్రంలోని అన్ని మసీదులను విద్యుత్ దీప కాంతులతో అలంకరించి ఉండడం విశేషం. ప్రార్థనలకు షామియానాలను, పందిళ్లను ఏర్పాటు చేశారు. అలాగే సంతల్లో పెద్ద ఎత్తున మేకలు, గొర్రెల విక్రయాలు జరిగాయి. సౌదీ అరేబియాలో శుక్రవారం రంజాన్ పండుగ జరగడంతో ఆ కాలమానాన్ని అనుసరిస్తూ రాష్ట్రంలో జాక్ వంటి కొన్ని మైనారిటీ సంఘాల నేతృత్వంలో ఈద్ ప్రార్థనలు పలుచోట్ల ముందుగానే జరిగాయి. శుక్రవారం ఉదయం కోవై కునియముత్తురు, నాగపట్నం, నాగూర్ ప్రాంతాల్లో ప్రార్థనలలో లీనమయ్యారు.
విక్రయిస్తున్న బిరియానీ
ముస్తాబైన పెద్ద మసీదు
నేతల శుభాకాంక్షలు..
రంజాన్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని ముస్లింలకు డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ప్రధాన ప్రతిపక్ష నేత, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ వేర్వేరు ప్రకటనలలో ముస్లింలు అందరూ ఆనందోత్సాహలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రేమానురాగాలు, సోదరభావం, సమానత్వం వికసించాలని ఆకాంక్షించారు. అలాగే డీఎండీకే ప్రధానకార్యదర్శి ప్రేమలత విజయకాంత్, పీఎంకే నేతలు రాందాసు, అన్బుమణి , ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ నేత ఖాదర్ మొహిద్దీన్, మనిద నేయ మక్కల్ కట్చి నేత జవహరుల్లా, తమిళ మానిల కాంగ్రెస్ అధినేత జీకే వాసన్, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్, చిన్నమ్మ శశికళ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సెల్వపెరుంతొగై, ఇతర పార్టీల నేతలు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.


