సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే కూటమి లెక్క తేలినట్టుంది. సీట్ల పంపకాలన్నీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కనుసన్నల్లో జరుగుతున్నాయి. బీజేపీకి 31 సీట్లను కేటాయించినట్టు సమాచారం. ఈ పంపకాల ప్రక్రియ నాలుగు రోజుల్లో ముగుస్తుందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ప్రకటించారు. అన్నాడీఎంకే, బీజేపీ సీట్ల పంచాయతీ మళ్లీ ఢిల్లీకి చేరిన విషయం తెలిసిందే. అమిత్‌షాతో పళనిస్వామి సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. లెక్కలనీ తేల్చినప్పటికీ, మిత్రులందర్నీ పిలిపించి సర్దుబాటును కొలిక్కి తెచ్చేపనిలో అమిత్‌షా నిమగ్నమైనట్టుంది. ఢిల్లీ నుంచి శుక్రవారం ఉదయం చైన్నెకి పళణిస్వామి చేరుకోగానే, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ బయలు దేరి వెళ్లారు. అమిత్‌షా నుంచి వచ్చిన ఆహ్వానంతోనే సీట్ల సర్దుబాటు నిమిత్తం ఆయన ఢిల్లీకి వెళ్లినట్టు, పీఎంకే నేత అన్బుమణితో అమిత్‌షా మాట్లాడి సీట్లను ఖరారు చేసినట్టు సమాచారం. ఈ మేరకు బీజేపీకి 31 సీట్లు, పీఎంకేకు 17, అమ్మమక్కల్ మున్నేట్ర కళగంకు 9, తమిళ మానిల కాంగ్రెస్‌కు 3 సీట్లు కేటాయించినట్టు చర్చ జరుగుతోంది. అయితే, ఎన్‌డీఏను నమ్ముకుని మొదటి నుంచి ప్రయాణం సాగిస్తున్న చిన్న పార్టీలకు బీజేపీ సీట్లు కేటాయించనున్నట్టు తెలిసింది. ఈ పార్టీల నేతలు బీజేపీ కమలం చిహ్నంతో పోటీ చేయబోతున్నారని ఆ పార్టీల మద్దతుదారులు పేర్కొంటున్నారు. కాగా, ఢిల్లీ నుంచి చైన్నెకి వచ్చిన పళణి స్వామి మీడియాతో మాట్లాడుతూ, పొత్తు, సీట్ల చర్చలన్నీ సజావుగానే జరుగుతున్నాయన్నారు. నాలుగు రోజులలో అన్ని ప్రక్రియలు ముగుస్తాయని. సీట్ల కేటాయింపు, నియోజకవర్గాల కేటాయింపు అన్ని ముగించేస్తామని వ్యాఖ్యలు చేశారు. కాగా, అన్నాడీఎంకేతో సీట్ల పంపకాల ఒప్పందం నిమిత్తం శనివారం బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చైన్నెకి రానున్నారు.


