సాక్షి,చైన్నె: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. శుక్రవారం మంచి రోజు కావడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు అభ్యర్థులు దాఖలు చేశారు. ఇంకా సీట్ల పంపకాలు పూర్తి కాకున్నా, తమ సిట్టింగ్ స్థానాలను రిజర్వుడ్ చేసుకునే విధంగా ఆయా పార్టీల ఎమ్మెల్యేలు నామినేషన్లు సమర్పించేశారు. ఇక, ఎన్‌డీఏ కూటమిలో సీట్ల స్పష్టతరానప్పటికీ సీఎం, ఎన్‌ఆర్ కాంగ్రెస్ అధినేత ఎన్. రంగసామి అనూహ్యంగా రెండు నియోజకవర్గాలలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
నామినేషన్ దాఖలు
ముఖ్యమంత్రి రంగసామి మధ్యాహ్నం మంగళం, తట్టంచవాడి నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు నామినేషన్లు వేశారు. నామినేషన్ వేయడానికి ముందు ఆయన కదిర్‌గామం మురుగన్ ఆలయం, అప్పాస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం రంగస్వామి ఓ వైపు నామినేషన్ దాఖలు చేస్తే ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు సైతం తమ తమ స్థానాలలో మళ్లీ పోటీ దిశగా నామినేషన్లను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. శని, ఆదివారం సెలవు కావడంతో, ఇక, నామినేషన్లకు సోమవారం చివరి రోజు కావడంతో ఓ వైపు బీజేపీ, మరో వైపు కాంగ్రెస్ నేతలలో కలవరం బయలుదేరింది. సీఎం రంగస్వామి రూపంలో బీజేపీ, డీఎంకే రూపంలో కాంగ్రెస్ ఇరకాటంలో పడి ఉన్నాయి. ఈ రెండు పార్టీల సీట్ల లెక్కలు ఇంకా తేలాల్సి ఉండడం గమనార్హం.
బుజ్జగింపు సర్దుబాటు
సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు కేంద్ర మంత్రి, పుదుచ్చేరి ఎన్నికల ఇన్‌చార్జ్ మన్సుఖ్ మాండవియా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో పుదుచ్చేరి చేరుకున్నారు. అయితే, ఆయనతో చర్చలు జరపకుండానే రంగసామి మదురై, తిరుచెందూర్ పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశమైంది. కేంద్ర మంత్రి హోటల్‌లో వేచి చూస్తున్నా, ఆయనను కలవకుండానే రంగసామి నామినేషన్ దాఖలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చ జోరుందుకునేలాచేశాయి. కూటమి కొనసాగుతోందని, విభేదాలు లేవు అని రంగస్వామి వ్యాఖ్యలు చేసినా, లోలోపల వివాదం అన్నది జోరందుకుని ఉంది. చివరకు రంగన్ననను బుజ్జగించే పనిలో కేంద్ర మంత్రి నిమగ్నమైనట్టు తెలిసింది. చివరకు ఎన్డీయే కూటమిలో ఎన్‌ఆర్ కాంగ్రెస్ 16 , బీజేపీ 10, అన్నాడీఎంకే 2, ఎల్‌జేపీ 2 సీట్లలో పోటీకి నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, లాటరీ కింగ్ జోస్ చార్లెస్ మార్టిన్‌న్‌కు చెందిన ఎల్‌జేపీ కూటమిలోకి వద్దు అని రంగస్వామి తేల్చి చెప్పినట్టు చర్చ జరుగుతోంది. అందుకే రంగస్వామి కినుకు వహించి ఉన్నట్టు పార్టీ వర్గాల పేర్కొంటున్నాయి.
ఎట్టకేలకు ఒకే నిర్ణయానికి డీఎంకే – కాంగ్రెస్:
ఢిల్లీ పెద్దల జోక్యంతో కాంగ్రెస్ వర్గాలు డీఎంకేకు తలవంచక తప్పదన్నట్టు సమాచారం. కూటమికి నాయకత్వం ఎవరో అన్న విషయాన్ని తాజాగా పక్కన పెట్టినట్టు సమాచారం. అయితే, పుదుచ్చేరిలోని 30 స్థానాలలో డీఎంకేకు 14, కాంగ్రెస్‌కు 14, వీసీకేకు ఒకటి, కమ్యూనిస్టులకు మరొకటి చొప్పున సీటు సర్దుబాటు చేసుకునేందుకు నిర్ణయించినట్టు తెలిసింది. ఎవరికి అధిక స్థానాలు విజయం వరిస్తాయో ఆ పార్టీ తరఫున సీఎం అభ్యర్థి ఎంపిక దిశగా నిర్ణయాలు తీసుకున్నట్టు చర్చ జరుగుతోంది. అయితే, ఈ పంపకాల విషయంగా అఽధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


