ఏఐ కంటెంట్‌లపై ఈసీ గురి | - | Sakshi
Sakshi News home page

ఏఐ కంటెంట్‌లపై ఈసీ గురి

Mar 21 2026 5:18 AM | Updated on Mar 21 2026 5:18 AM

● అమల్లోకి కఠిన నిబంధనలు

సాక్షి,చైన్నె: తమిళనాడు అసెంబ్లీ సాధారణ ఎన్నికల నిర్వహణ దిశగా ఎన్నికల సంఘం చర్యలు వేగవంతం చేసింది. ఓటర్లను తప్పుదోవ పట్టించకుండా, పారదర్శకమైన ఎన్నికల కోసం పొలిటికల్‌ అడ్వర్టైజ్‌మెంట్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్‌న్స్‌ వాడకం, ఎన్నికల సిబ్బంది సంక్షేమంపై ప్రధాన ఎన్నికల అధికారి అర్చనా పట్నాయక్‌ శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా ప్రకటించారు. సోషల్‌ మీడియా లేదా ఎలక్ట్రానిక్‌ మీడియాలో రాజకీయ ప్రకటనలు విడుదల చేయాలనుకునే పార్టీలు, అభ్యర్థులు కచ్చితంగా ముందస్తు అనుమతి పొందాలని స్పష్టం చేశారు. ప్రసారానికి మూడు రోజుల ముందే గుర్తింపు పొందిన పార్టీలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర అభ్యర్థులు, పార్టీలు 7 రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను 48 గంటల్లోగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని, పెయిడ్‌ న్యూస్‌ నిరోధించడమే దీని ప్రధాన ఉద్దేశంగా పేర్కొన్నారు. డీప్‌ఫేక్స్‌, ఏఐపై ఉక్కుపాదం మోపుతూ మరో నిర్ణయం తీసుకున్నారు.ఎన్నికల ప్రచారంలో ఏఐ ద్వారా సృష్టించిన తప్పుడు కంటెంట్‌ను అడ్డుకునేందుకు కఠిన నిబంధనలు అమల్లోకితీసుకొచ్చారు. సోషల్‌ మీడియాలో ఏదైనా అభ్యంతరకర కంటెంట్‌ కనిపిస్తే, ఫిర్యాదు అందిన 3 గంటల్లోపు దానిని తొలగించేలా చర్యలు తీసుకుంటారు.

బీఎల్‌ఓల వేతనం పెంపు

ఓటరు జాబితా రూపకల్పనలో కీలక పాత్ర పోషించే బూత్‌ లెవల్‌ ఆఫీసర్ల వార్షిక వేతనాన్ని పెంచారు. గతంలో ఉన్న రూ. 6వేల వేతనాన్ని రూ.12వేల కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.దీనికి అదనంగా ప్రత్యేక సవరణ పనుల కోసం రూ. 2వేల ప్రోత్సాహకం కూడా అందించనున్నారు.

అపార్ట్‌ మెంట్లలోనే పోలింగ్‌ కేంద్రాలు:

పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం వినూత్న నిర్ణయం తీసుకుంది. పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీల లోపలే పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రత్యేక సవరణ కింద ఇప్పటికే 14 పోలింగ్‌ కేంద్రాలను ఇటువంటి నివాస సముదాయాల్లో ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. అలాగే, ఎన్నికల విధులలో మాజీ పోలీసు అధికారులను భాగస్వామ్యం చేయడానికి నిర్ణయించి, దరఖాస్తులను ఆహ్వానించారు. చైన్నె శివారులోని మాధవరంలో పెద్ద ఎత్తున బంగారం పట్టు బడింది. డీఎంకె సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, నియోజకవర్గంలో కానుకల పంపిణీలో బిజీగా ఉన్నారంటూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు అందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement