వేలూరు: వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో ఆరోగ్య సంరక్షణ రంగంలో పలు పరిశోధనలు చేసేందుకు వేలూరు వీఐటీ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం చేసుకున్నారు. వీటిలో సీఎంసీ మెడికల్ కళా శాల ప్రిన్సిపల్ డాక్టర్ సాలుమోన్ సతీష్‌కుమార్, వీఐటీ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌లు జయభారతి ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు. వీఐటీ చాన్స్‌లర్ విశ్వనాథన్ సమక్షంలో సంతకాలు చేసిన అవగాహన ఒప్పందాలను పరస్పరం మార్చుకున్నారు. ఈ సందర్భంగా వీఐటీ చాన్స్‌లర్ విశ్వనాథన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలుపుతూ వేలూరు క్రిష్టియన్ మెడికల్ కళాశాల దేశంలోనే అత్యుత్తమ ఆస్పత్రిలో ఒకటిగా ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మొట్ట మొదటిసారిగా నిర్వహించిన అనేక వైద్యపరమైన శస్త్ర చికిత్సలు సీఎంసీ ఆస్పత్రిలోనే జరిగిందన్నారు. 1948వ సంవత్సరంలో ప్రపంచంలోనే మొట్ట మొదటి సారిగా శస్త్ర చికిత్స సీఎంసీలోనే ప్రారంభించారన్నారు. అదే విధంగా 1946లో మొట్ట మొదటి సారిగా ఇక్కడ నర్శింగ్ కలాశాల, 1961లో మొట్ట మొదటి సారిగా ఓపెన్ హార్ట్ సర్జరీ, 1971లో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స ప్రారంభించారన్నారు. సీఎంసీ ప్రిన్సిపల్ సాలుమోన్ సతీష్‌కుమార్ మాట్లాడుతూ వీఐటీలోని బయో ఇంజినీరింగ్, బయో ఇన్ఫార్మాటిక్స్, బయో మెటీరియల్స్ రంగాలలో నూతన అవిష్కరణలను వీఐటీ చేస్తుందన్నారు. వీటి ద్వారా తాము రోగులకు ఉన్నత మైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అందించ గలుగుతామన్నారు. ఈ ఒప్పందం వల్ల వీఐటీ విద్యార్థులు, ప్రొఫెసర్‌లు, సీఎంసిలో పరిశోధనలు చేసేందుకు ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. సీఎంసీ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ బిజు జార్జ్, వీఐటీ ఉపాద్యక్షులు శంకర్ విశ్వనాథన్, శేఖర్ విశ్వనాథన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంధ్యా పెంటారెడ్డి, వైస్ చాన్స్‌లర్ కాంచన, ప్రొ వైస్ చాన్స్‌లర్ పార్థసారతి మల్లిక్, డీన్ ఆఫ్ హెల్త్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ గీత, డాక్టర్ దీపక్ సెల్వరాజ్ పాల్గొన్నారు.


