తమిళసినిమా: యోగిబాబు ఇప్పుడు చాలా బిజీ. హాస్య పాత్రలోనూ, కథానాయకుడిగాను నటిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అలా ఈయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కెనత్త కానోమ్. లవ్లిన్ చంద్రశేఖర్ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని ఆర్పి టాకీస్ పతాకంపై రమేష్‌బాబు నిర్మించారు. ఒరు కిడాయిన్ కరుణై మను అంతే పలు అవార్డులను గెలుచుకున్న చిత్ర దర్శకుడు సురేష్ సంగయ్య దర్శకత్వం వహించిన చిత్రం ఇది. దురదష్టవశాత్తు ఈ చిత్రం విడుదలకు ముందే దర్శకుడు మరణించారు. ఆ తర్వాత ఎంతో పట్టుదలతో నిర్మాత నిర్మాణాంత కార్యక్రమాలను పూర్తిచేసి గతవారం విడుదల చేశారు. ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శన పడుతోంది. దీంతో చిత్ర యూనిట్ గురువారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో థ్యాంక్స్ గివింగ్ సమావేశాన్ని నిర్వహించారు. యోగిబాబు మాట్లాడుతూ ఈ చిత్రం ప్రేక్షకుల్లోకి వెళ్లాలని దర్శకుడు సురేష్ సంగయ్య కలలు కన్నారని, ఆయన కల ఇప్పుడు నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. థియేటర్లో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి చాలా మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ఇలాంటి నిర్మాతలు లభించడం సినిమాకు వరప్రసాదమని అన్నారు. ఇలాంటి సామాన్య ప్రజల జీవితాలను, వారి పోరాటాలను ప్రతిబింబించే కథా చిత్రాల్లో తాను నటిస్తూనే ఉంటానని ఆయన పేర్కొన్నారు. లవ్లిన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ తరుణం తనకు మిశ్రమ అనుభవాలను కలిగిస్తోందన్నారు. చిత్ర విజయం కలిగిస్తున్న ఆనందం ఒక పక్క, మరోపక్క సురేష్ సంగయ్య ఇప్పుడు మనతో లేకపోవడం బాధిస్తోందన్నారు. ఆయన కుటుంబానికి మన చేతనైన సాయాన్ని చేయాలని ఈ వేదికపై తాను కోరుకుంటున్నానని అన్నారు.


