జీఎస్‌టీ చెల్లించాలని నోటీసులు
వేలూరు: ప్రభుత్వ టీచర్‌కు రూ.76.31 లక్షలు జీఎస్‌టీ చెల్లించాలని నోటీసు రావడంతో అవాకై ్కన టీచర్ వేలూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పోలీసు కార్యాలయంలో ఎస్పీ శివరామన్ అధ్యక్షతన ప్రతి వారం ప్రజా గ్రీవెన్స్ సెల్ జరుగుతుంది. అందులో భాగంగా జరిగిన గ్రీవెన్స్ సెల్‌లో వచ్చిన ఫిర్యాదు మేరకు వేలూరు జిల్లా పేర్నంబట్టు ప్రాంతానికి చెందిన ప్రభుత్వ పాఠశాల టీచర్ సెల్వి ఇచ్చిన ఫిర్యాదులో తన ఆధార్, పాన్‌కార్డులను పెట్టుకొని నకిలీగా తయారు చేసి తిరుపూరులో ఒక కంపెనీ ప్రారంభించినట్లు తెలిపారు. వీటి ద్వారా తాను రూ.76.31 లక్షలు ప్రభుత్వానికి జీఎస్‌టీ చెల్లించాలని నోటీసు వచ్చినట్లు పేర్కొంది. తాను బ్యాంకులో నగదు తీసేందుకు వెళ్లిన సమయంలో తాను జీఎస్‌టీ నగదు చెల్లించక పోవడంతో తన ఖాతాలోని లావాదేవీలను నిలిపి వేసినట్లు బ్యాంకు అధికారులు తెలిపారన్నారు. బ్యాంకు ఖాతాను నిలిపి వేయడంతో తాను జనవరి మాసం నుంచి ఎటువంటి నగదు తీయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని పేర్కొన్నారు. వెంటనే వీటిపై అధికారులు విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరారు.


