రెవెన్యూ ఉద్యోగుల సమ్మెబాట
తిరువళ్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖలో వున్న అసిస్టెంట్‌లకు పీరియాడికల్ వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెకు దిగారు. తిరువళ్లూరు జిల్లాలోని పూందమల్లి, ఆవడి, అంబత్తూరు, పొన్నేరి, గుమ్మిడిపూండితోపాటు 11 తాలుకా కార్యాలయాల్లో రెవెన్యూ అసిస్టెంట్‌లు ఆందోళన బాట పట్టారు. తమ విధులను బహిష్కరించి నిరవధిక సమ్మెకు దిగారు. తిరువళ్లూరు తాలుకా కార్యాలయంలో నిర్వహించిన ఆందోళనలో ముఖ్యఅతిథిగా ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ హాజరై ప్రసంగించారు. రెవెన్యూశాఖలో అసిస్టెంట్‌లుగా పనిచేస్తున్న వారికి పిరిడియాకల్ వేతనాలు, స్థిర కాలిక వేతనాల చెల్లింపు, పాత పింఛన్ విధానం అమలు, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీలను వెంటనే భర్తీ చేయడం లాంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్‌లను పరిష్కరించాలని కోరుతూ ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నా పట్టించుకోవడం లేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ విధులను బహిష్కరించి సామూహిక సమ్మెకు దిగినట్టు వివరించారు. తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంఘం నేతలు వేణు, కందన్, కన్నన్, రజినీ పాల్గొన్నారు.
గ్రామ సహాయకులు సమ్మెబాట
తిరుత్తణి: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని గ్రామ సహాయకులు గురువారం నుంచి నిరవధిక సమ్మె బాటపట్టారు. తమిళనాడు గ్రామ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో గ్రామ సహాయకులకు స్కేల్ ఆఫ్‌పే అందజేయాలనే డిమాండ్ మేరకు విధులు బహిష్కరించి గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తాలూకా కార్యాలయాల ముందు సమ్మెబాట చేపట్టారు. తిరుత్తణి తహసీల్దార్ కార్యాలయం వద్ద 50కు పైబడిన గ్రామ సహాయకులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. అలాగే పళ్లిపట్టు, ఆర్కేపేట ప్రాంతాల్లోని తాలూకా కార్యాలయాల వద్ద గ్రామ సహాయకులు ధర్నాలో పాల్గొన్నారు. దీంతో పంచాయతీల్లో రెవెన్యూ, గ్రామీణుల సేవలు ఆటంకం ఏర్పడ్డాయి.
రెవెన్యూ ఉద్యోగుల సమ్మెబాట


