క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Feb 20 2026 6:56 AM | Updated on Feb 20 2026 6:56 AM

క్లుప్తంగా

క్లుప్తంగా

రౌడీ షీటర్లు ముగ్గురి అరెస్ట్‌

తిరువళ్లూరు: పలు హత్యకేసుల్లో నిందితులుగా వుంటూ పరారీలో వున్న ముగ్గురు రౌడీషీటర్లను వెళ్లవేడు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా వెళ్లవేడు సమీపంలోని బాలాజీ నగర్‌ ప్రాంతానికి చెందిన చెల్లప్పు అలియాస్‌ ఇళమురుగన్‌(22). ఇతడిపై పలు కేసులు వున్నాయి. అదేవిధంగా తిరుమళిసై ప్రాంతానికి చెందిన ఆకాష్‌(30). ఇతనిపై 13 కేసులు వున్నాయి. అలాగే తిరుమళిసై కస్తూరీబాయ్‌ వీధికి చెందిన జగన్‌(27). ఇతనిపై రెండు హత్యకేసులు వున్నాయి. అయితే వీరు కోర్టుకు హాజరు కాకుండా పరారై అజ్ఞాతంలో వుంటూ పలు ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడంతో పోలీ సులు నిఘా వుంచి ముగ్గురిని వెళ్లవేడులో అరెస్టు చేశారు. అనంతరం వీరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

గ్రామ కార్యదర్శులపై

సస్పెన్షన్‌ వేటు

పళ్లిపట్టు: సమ్మెలో పాల్గొన్న 13 మంది గ్రామ కార్యదర్శులపై సస్పెన్షన్‌ వేటు పడింది. గ్రామ పంచాయతీ కార్యదర్శులకు పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని, ఖాళీ పోస్టుల భర్తీ, జీతం పెంచాలన్న డిమాండ్ల మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శులు గత నెల నుంచి నివరధిక సమ్మెలో పాల్గొంటున్నారు. 25 రోజులపాటు సమ్మెతో గ్రామ పంచాయతీలో కనీస సేవలకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో బుధవారం నాటికి విధులకు హజరుకాని కార్యదర్శులను సస్పెండ్‌ చేస్తామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో చాలామంది సిబ్బంది సమ్మె వీడి విధులకు హాజరయ్యారు. ప్రభుత్వ హెచ్చరికలు సైతం భేఖాతరు చేయకుండా సమ్మెలో పాల్గొన్న వారిపై చర్యలకు తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. దీంతో పళ్లిపట్టు యూనియన్‌లోని 33 గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న 25 మంది పంచాయతీ కార్యదర్శుల్లో 12 మంది విధులకు హాజరుకాగా, సమ్మెలో పాల్గొన్న 13 మందిని సస్పెండ్‌ చేస్తూ బీడీఓ అరుల్‌ బుధవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. దీంతో గ్రామ కార్యదర్శులు తీవ్ర ఆందోళన చెందారు. సస్పెన్షన్‌కు గురైన కార్యదర్శుల స్థానంలో బీడీఓ కార్యాలయ సిబ్బంది విధులు నిర్వహిస్తారని బీడీఓ తెలిపారు. తిరుత్తణి, ఆర్కేపేట, తిరువలంగాడు మండలాల్లో గ్రామ కార్యదర్శులు ప్రభుత్వ హెచ్చరికతో విధులకు హాజరుకావడంతో సస్పెన్షన్‌ చర్యల నుంచి తప్పించుకోవడం గమనార్హం

యువతిని కత్తితో పొడిచి ఆత్మహత్య

తిరువొత్తియూరు: కయత్తారులో యువతిని కత్తితో పొడిచి తానూ విషం తాగి ఓ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తూత్తుకుడి జిల్లా కయత్తారు కోడై పిళ్లైయార్‌ కోవిల్‌ వీధికి చెందిన మహారాజన్‌(55) కూలీ. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మహారాజన్‌కు గత మూ ేళ్లుగా మానసిక సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం అతని కుమారుడు మహారాజన్‌ను మందలించినట్లు తెలిసింది. సంఘటన జరిగిన రోజు సాయంత్రం కలైవాణర్‌ వీధిలో నివాసముంటున్న ఇసక్కిరాజ్‌ అనే వ్యక్తి ఇంటికి వెళ్లాడు. అక్కడ అతని భార్య ఇసక్కియమ్మాళ్‌(28) గ్రైండర్‌లో దోసె పిండి రుబ్బుతోంది. ఆ సమయంలో హఠాత్తుగా ఆమె వెనకకు వెళ్లిన మహారాజన్‌ కత్తితో ఇసక్కియమ్మాళ్‌ను పొడిచాడు. ఆమె కేకలు విని చుట్టుపక్కల వారు పరుగెత్తుకు రావడంతో మహారాజన్‌ అక్కడి నుంచి పారిపోయి తన ఇంటి పైఅంతస్తుకు వెళ్లాడు. అక్కడ ఉన్న ఎలకల మందు తాగి స్పృహకోల్పోయాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన ఇసక్కియమ్మాళ్‌, విషం తాగిన మహారాజన్‌ను పాళై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మహారాజన్‌ మృతిచెందాడు.కయత్తూరు పోలీ సులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఉయ్యాలూగుతూ చిన్నారి మృతి

వేలూరు: వేలూరు సమీపంలో ఉయ్యాల ఆడుతున్న చిన్నారి గొంతుకి తాడు చిక్కుకొని మృతి చెందిన సంఘటన సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే వేలూరు జిల్లా విరింజిపురం గ్రామానికి చెందిన పయణి పెట్రోల్‌ బంక్‌ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతని భార్య సత్యప్రియ దంపతుల కుమార్తె జీవిత(9) ఈమె అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. సత్యప్రియ ఇంటిలో వంట పనులు చేస్తున్న సమయంలో చిన్నారి జీవిత తన ఇంటి కిటికీలకు పక్క ఇంటికి చీరను ఉయ్యాలగా కట్టుకొని ఆడుకుంటోంది. ఆ సమయంలో ఉన్నపళంగా ఆ చీర చిన్నారి జీవిత మెడకు చిక్కుకుంది. దీంతో చిన్నారి అక్కడిక్కడే స్పృహ తప్పి పడిపోయింది. వీటిని గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి జీవిత మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న విరింజిపురం పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

మనలి ఎక్స్‌ప్రెస్‌వేపై నిరసన

తిరువొత్తియూరు: తిరువొత్తియూరు, మనలి ఎక్స్‌ప్రెస్‌వేపై కంటైనర్‌ లారీలు రోడ్డుకు ఇరువైపులా నిలుపుదల చేస్తున్నారు. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కంటైనర్‌ లారీలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో గురువారం ఉదయం మనలి పుదునగర్‌కు చెందిన మణికంఠన్‌(33) అనే వ్యక్తి మోటార్‌ సైకిల్‌పై మనలి ఎక్స్‌ప్రెస్‌వేకు వచ్చాడు. ఆ సమయంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కంటైనర్‌ లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతన్ని ఆస్పత్రిలో చేర్చారు. ఈ నేపథ్యంలో లారీల నిలుపుదలను అడ్డుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని దిగ్బంధంలో పాల్గొన్నారు. కార్పొరేషన్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ కౌన్సిలర్‌ జయరామన్‌ కూడా పాల్గొన్నారు. అకస్మాత్తుగా అతను అక్కడ నిలిచి ఉన్న నగర బస్సు ముందు పడుకుని నిరసన తెలిపాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దిగ్బంధంలో పాల్గొన్న వారితో చర్చలు జరిపారు. మనలి ఎక్స్‌ప్రెస్‌వే రోడ్డును నిర్మించాలని, ప్రమాదాలను నివారించడానికి లారీలను నిలపకూడదని ప్రజలు డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement