త్రిబుల్ టీ చిత్రానికి దర్శకుడే హీరో
తమిళసినిమా: నటుడు జీవా కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం త్రిబుల్ టీ( తంబి తలైవర్ తంబి తలమైయిల్). నటుడు తంబిరామయ్య, ఇళవరసు, ప్రార్ధన, జయ్‌వంత్, జాన్సన్ తివారి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని నితేశ్ సహాదేవ్ దర్శకత్వంలో కన్నన్ రవి ప్రొడక్షన్స్ పతాకంపై కన్నన్ రవి నిర్మించిన ఈ చిత్రానికి దీపక్ రవి సహా నిర్మాతగా వ్యవహరించారు. కాగా ఈ చిత్రం పొంగల్ సందర్భంగా విడుదలై ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. దీంతో ఇటీవల ఈ చిత్ర విజయోత్సవ వేడుకలను చైన్నెలోని ఓ హోటల్‌లో నిర్వహించారు. ఈ చిత్ర నిర్మాత దుబాయిలో నివశిస్తున్న తమిళుడు కావడం గమనార్హం. ఈయన మాట్లాడుతూ ఈ చిత్రం విజయోత్సవం అనేదాని కంటే తమ కన్నన్ రవి టీమ్‌కు లభించిన గుర్తింపు అనే తాను భావిస్తున్నానన్నారు. ఒకరు విజయం సాధించాలంటే ఆయనకు కుటుంబం మంచిగా అమరాలన్నారు. అలా ఈ చిత్ర విజయానికి కారణం అయిన చిత్ర యూనిట్ అందరికి ధన్యవాదాలు అని పేర్కొన్నారు. చిత్ర కథానాయకుడు జీవా మాట్లాడుతూ తాము 4,5 నెలల పాటు కుమిళిలో బస చేసి ఒక కుటుంబంగా ఈ చిత్రం కోసం పని చేశామన్నారు. ఆ ప్రాంత ప్రజలు ప్రేమాభిమానాలే ఈ చిత్ర విజయనికి ముఖ్య కారణంగా పేర్కొన్నారు. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రానికి దర్శకుడు నితేశ్ సహాదేవ్‌నే హీరో అన్నారు. ప్రతి నటీనటుల నుంచి తనకు కావలసిన నటనను రాబట్టుకున్నారని అన్నారు. తనకు ఓ నటుడిగా ఈ చిత్రం ద్వారా మంచి విజయాన్ని ఇచ్చారని అన్నారు. తనకు నటుడు ఈటీవీ గణేశ్‌నే సిఫార్సు చేశారని , అలా నిర్మాత కన్నన్ రవిను కలిసిన వేంటనే తనకు అడ్వాన్స్ కూడా ఇచ్చారని చెప్పారు. ఆయన ఆ నమ్మకమే ఈ విజయం అని పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమంలో సీమాన్,బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్, ఆర్కే సెల్వమణి, కేఎస్.రవికుమార్, పార్తీపన్, సముద్రఖని, ఆర్‌బీ.చౌదరి మొదలగు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని యూనిట్ సభ్యులను అభినందించారు.


