విజయవంతంగా సైక్లింగ్ వెలోడ్రోమ్
సాక్షి, చైన్నె: చైన్నెలోని తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ వేదికగా ఎస్‌డీఏటీ సైక్లింగ్ వెలోడ్రోమ్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. వివరాలు.. తమిళనాడు సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమిళనాడుస్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎస్‌డీఏటీ) సహకారంతో జనవరి 29 నుంచి 31 వరకు ట్రాక్ ఆసియా కప్ 2026 అద్భుతమైన రేసులు, ఉత్కంఠభరితంగా సాగాయి. అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలతో ఘనంగా ముగిసింది. ఈ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో ఆసియా ఖండానికి చెందిన 11 దేశాల నుంచి 70 మంది అంతర్జాతీయ సైక్లిస్టులు, అలాగే 50 మంది భారతీయ సైక్లిస్టులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఎస్‌డీఏటీలో శిక్షణ పొందుతున్న యువ రైడర్లు కూడా తమ సత్తా చాటుకునే ప్రయత్నం చేశారు. పోటీల్లో భారత సైక్లిస్టులు పలు విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచారు. ఉమెన్ ఎలైట్ కీరిన్ విభాగంలో భారత జాతీయ జట్టు క్రీడాకారిణి పాల్ త్రియాష స్వర్ణ పతకం గెలుచుకోగా, రంగస్వామి సి. కీర్తి రజత పతకం సాధించారు. పురుషుల జూనియర్ కీరిన్ విభాగంలో నరేంగ్‌బామ్ మాక్స్ సింగ్ స్వర్ణ పతకం సాధించగా, లిథువేనియా సైక్లిస్ట్ సింగా డోవిడాస్ రజతం పొందారు. మహిళల ఎలైట్ ఓమ్నియం విభాగంలో ఉజ్బెకిస్థానన్‌కు చెందిన కొజీవా నఫోసాట్ అద్భుతమైన ప్రదర్శనతో మొత్తం పాయింట్ల రేస్ ఫైనల్‌లో 120 పాయింట్లతో స్వర్ణం సాధించారు.
భారత్‌కు రజతం..
భారత సైక్లిస్ట్ సింగ్ స్వస్తి 106 పాయింట్లతో రజత పతకం గెలుచుకున్నారు. టెంపో రేస్‌లో కూడా కొజీవా నఫోసాట్ స్వర్ణం సాధించగా, ఇండోనేషియా క్రీడాకారిణి అనస్తాస్య అందిని పుత్రి రజతం పొందారు. మహిళల జూనియర్ విభాగంలో, స్క్రాచ్ రేస్‌లో కజకిస్తాన్‌కు చెందిన స్మైల్కనోవా ఐగెరిమ్ స్వర్ణ పతకం గెలుచుకోగా, ఎస్‌డీఏటీ రేసింగ్‌కు చెందిన కధీర్వెల్ హాషిని రజతంతో మెరిశారు. 200 మీటర్ల స్ప్రింట్ విభాగంలో, భారత జాతీయ జట్టు క్రీడాకారిణులు షఫీ తబితా స్వర్ణం, సోమన్ ఆభా శ్రీమాన్ రజతం సాధించారు. ఈ సందర్భంగా ఎస్‌డీఏటీ సభ్య కార్యదర్శి జె. మేఘనాథ రెడ్డి మాట్లాడుతూ, ట్రాక్ ఆసియా కప్ 2026 భారత సైక్లింగ్ చరిత్రలో ఒక మైలురాయిగా పేర్కొన్నారు. అద్భుతమైన ప్రదర్శనలు , అథ్లెట్ల పెరుగుతున్న స్థాయిని, అలాగే సైక్లింగ్ వెలోడ్రోమ్ ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని చాటుకున్నామన్నారు.. అంతర్జాతీయ క్రీడా ప్రతిభను ప్రోత్సహించడంలో తమిళనాడు ముందంజలో ఉందని స్పష్టం చేశారు.టీఎన్‌సీఏ అధ్యక్షుడు ఎం. సుధాకర్ మాట్లాడుతూ, మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో నమోదైన ఫలితాలు ట్రాక్ ఆసియా కప్ 2026 విజయాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. భారతీయ మరియు తమిళనాడు సైక్లిస్టులకు అంతర్జాతీయ స్థాయి అనుభవాన్ని అందించిన ఈ ఈవెంట్‌ను నిర్వహించినందుకు గర్వంగా ఉందన్నారు.


