క్లుప్తంగా
తిరుపతి లాడ్జిలో
యువతి ఆత్మహత్య
తిరుపతి క్రైం: ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీకే లేఅవుట్‌లో ఉన్న ఓ లాడ్జిలో యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం రాత్రి కలకలం రేపింది. మృతురాలు తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లాకు చెందిన రీతు (20)గా పోలీసులు గుర్తించారు. కాంచీపురం పోలీస్ స్టేషన్‌లో రీతు మిస్సింగ్ కేసుగా నమోదై ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. లాడ్జిలో యువతి మృతి చెందిన విషయాన్ని గుర్తించిన ఈస్ట్ పోలీసులు వెంటనే కాంచీపురం పోలీసులకు సమాచారం అందించారు. యువతి మరణానికి గల కారణాలు కుటుంబ సభ్యులు, కాంచీపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఈస్ట్ పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా యువతి మానసిక పరిస్థితి సరిగా లేదని, ఆమె తన తల్లిదండ్రులతో కూడా మన ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతారని చెప్పినట్లుగా తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
నేడు తిరుత్తణి ఆలయంలో తైపూసం
తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో తైపూసం సందర్భంగా ఆదివారం భక్తుల సౌకర్యార్థం 15 ప్రత్యేక ఉచిత బస్సులు నడపనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. తైపూసం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది భక్తులు కావళ్లతో తిరుత్తణి కొండకు చేరుకుని స్వామిని దర్శించుకోనున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు 15 ప్రత్యేక ఉచిత బస్సులు కొండకు నడపనున్నారు. ఇందుకోసం రైల్వేస్టేషన్ నుంచి రెండు బస్సులు, వసతి గృహం నుంచి 4, ఘాట్‌రోడ్డు నుంచి 9 బస్సులు సహా 15 బస్సులు ఉదయం నుంచి రాత్రి వరకు నడిపేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ ఘాట్‌రోడ్డులో ఆదివారం ఆటోలకు నిషేధం విధించారు. కొండపై అభివృద్ధి పనులు జరుగుతున్న క్రమంలో స్థల సమస్య తీవ్రంగా వుంది. దీంతో కొండపై 250 కార్లు మాత్రమే పార్కింగ్ చేసే అవకాశం వున్నందున అధిక స్థాయిలో కార్లు. బైకులు కొండకు చేరుకుంటే స్థలం లేని పక్షంలో కొండ కింద పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు.
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
తిరువళ్లూరు: పరేడ్ గ్రౌండ్‌లో కవాతు నిర్వహిస్తూ స్పృహ తప్పి కిందపడ్డ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందాడు. తిరువణ్ణామలై జిల్లాకు చెందిన సత్యరాజ్(34). 2013వ సంవత్సరంలో కానిస్టేబుల్‌గా ఎన్నికై తిరువళ్లూరులో బెటాలియన్‌లో పనిచేస్తున్నాడు. ఇతని భార్య నదియా. వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. ఈక్రమంలో శనివారం ఉదయం యథావిధిగా పోలీస్ గ్రౌండ్‌లో జరిగే కవాతులో పాల్గొన్న సత్యరాజ్ హఠాత్తుగా స్పృహతప్పి కిందపడిపోయాడు. వెంటనే సహచర పోలీసులు అతడ్ని తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఓవర్ హెడ్ ట్యాంకర్
ఉద్యోగులకు జీతం పెంపు
సాక్షి, చైన్నె :గ్రామాలలో ఓవర్ హెడ్ ట్యాంక్‌లను పర్యవేక్షిస్తూ, ఉదయం వేళలలో నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటూ వస్తున్న పార్ట్ టైమ్ ఉద్యోగులకు గౌరవ వేతనం రూ. 4 వేల నుంచి రూ.5 వేలకు పెంచుతూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్రంలో 40419మంది ఈ విధులలో ఉన్నారని వివరించారు. 2021లో వీరి గౌరవ వేతనం రూ. 2,600 ఉండగా, రూ. 4 వేలకు పెంచామని, తాజాగా ఈ మొత్తం రూ. 5 వేలకు పెంచినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ఆరోగ్య సంరక్షణ సేవలకు విస్తృతంగా నిధులు
సాక్షి, చైన్నె : దీర్ఘాయువు , నివారణ ఆరోగ్య సంరక్షణను విస్తరించడానికి నిధుల సేకరణ విస్తృతం చేశామని బయోపీక్ వ్యవస్థాపకుడు రిషి పార్డాల్ తెలిపారు.ఇందుకు సంబంధించిన వివరాలను స్థానికంగా ప్రకటించారు. ఇందు కోసం బెంగళూరులో కొత్త ప్లాగ్ షిప్ సెంటర్‌తో సహా మల్టీ డిసిప్లినరీ స్పెషలిస్టు నేతృత్వంలో క్లినిక్‌లు, డయాగ్నస్టిక్స్, ఏఐ , పరిశోధలను విస్తరించనున్నట్టు వివరించారు. పునరావృత పెట్టుబడి దారులైన నిఖిల్ కామత్ నేతృత్వంలో తాజా నిధుల రౌండ్‌లో జెరోధా పెట్టుబడి విభాగం ఎన్‌కేఎస్ క్యూర్డ్ ద్వారా 2.7 మిలియన్లను సేకరించినట్టు ప్రకటించారు. కొత్త నిధులు నిర్మాణాత్మక, నివారణ–ఆధారిత, దీర్ఘాయువు–కేంద్రీకృత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను విస్తరించడానికి ఉపయోగించనున్నామని వివరించారు.
క్లుప్తంగా


