సాతనూర్ నుంచి నీటి విడుదల
వేలూరు: రైతులు ఆరు తడి పంటలను సాగు చేసుకునేందుకు సాతనూర్ డ్యామ్ నుంచి 105 చెరువులకు నీటిని విడుదల చేస్తున్నట్లు మంత్రి ఏవావేలు తెలిపారు. శనివారం ఉదయం కలెక్టర్ తర్పగరాజ్ అధ్యక్షతన సాతనూర్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేశారు. తిరువణ్ణామలై జిల్లాలోని తెన్‌పోన్నై నదికి అడ్డంగా నిర్మించిన సాతనూర్ డ్యామ్‌లో ప్రస్తుతం 97.50 అడుగుల నీటి మట్టం ఉంది. డ్యామ్‌లోని కుడి, ఎడమ కాలువల నుంచి రైతులు ఆరుతడి పంటలు పండించుకునేందుకు నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. దీంతో జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపి నీటిని విడుదల చేసేందుకు అవసరమైన అనుమతిని పొందారు. మంత్రి మాట్లాడుతూ 45 రోజులపాటు డ్యామ్ గేట్లు తెరచి ఉంచనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా జిల్లాలోని తండ్రాంబట్టు తాలుకా, తిరువణ్ణామలై, కళ్లకుర్చి, విల్లుపురం జిల్లాల్లో 12,543 ఎకరాల వ్యవసాయ భూమికి నీటి సరఫరా చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా విల్లుపురం జిల్లాలోని తిరుకోవిలూరు, శంకరాపురం తాలుకాల్లోని 54 చెరువులకు నీటిని పంపి వాటి ద్వారా 10,043 ఎకరాల వ్యవసాయ పొలాలకు నీటిని సరఫరా చేయనున్నట్లు తెలిపారు. రైతులు వీటి ద్వారా ఆరుతడి పంటలు వేసుకొని వాటి ద్వారా సాగు చేసుకోవాలన్నారు. డ్యామ్ నుంచి వచ్చే నీటిని వృథా చేయకుండా పొదుపు చేయాలన్నారు. డిప్యూటీ స్పీకర్ పిచ్చాండి, ఎంపీ అన్నాదురై, ఎమ్మెల్యేలు గిరి, శరవణన్, అధికారులు పాల్గొన్నారు.


