ఆవులకు మైక్రోచిప్‌లు తప్పనిసరి
– పార్కులు, వీధుల పేర్లపై కీలక తీర్మానాలు
సాక్షి, చైన్నె: చైన్నెలో రోడ్లపై తిరిగే ఆవులకు మైక్రో చిప్‌లను తప్పనిసరి చేశారు. పశువులు, ఎద్దులను రోడ్లపై నియంత్రించేందుకు విస్తృత చర్యలు చేపట్టారు. అలాగే, చైన్నెలో పార్కుల నిర్వహణ, వీధుల పేర్ల మార్పులు, బస్‌స్టేషన్ నిర్మాణం వంటి అంశాలపై పాలక మండలి సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. శుక్రవారం రిప్పన్ బిల్డింగ్‌లో మేయర్ ప్రియ అధ్యక్షతన కార్పొరేషన్ పాలక మండలి సమావేశం జరిగింది.
ఆవుల మైక్రోచిప్ విధానం
చైన్నెలో పెంచే ప్రతి పశువులకు మైక్రోచిప్ తప్పనిసరి చేస్తూ ఈ సమావేశంలో తీర్మానం చేశారు. ఇందుకుగాను రుసుం రూ.100గా నిర్ణయిస్తూ, మార్చి 18లోపు ఆవుల యజమానులు తమ వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే, రోడ్లపై అనుమతి లేకుండా ఆవులు తిరిగిన పక్షంలో రూ.10 వేలు జరిమానా విధించేందుకు తీర్మానించారు. ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డు తవ్వే కాంట్రాక్టర్లకు లేదా ప్రైవేట్ వ్యక్తులకు రూ.లక్ష జరిమానావిధించేందుకు చర్యలు తీసుకున్నారు.
జోన్లకు పార్కుల నిర్వహణ
జోనల్ కమిటీ చైర్మన్ వి.వి. రాజన్ తన ప్రసంగంలో కార్పొరేషన్ పార్కుల నిర్వహణ బాధ్యత జోన్లకు అప్పగించాలని కోరారు. ఇందుకు మేయర్ ప్రియ సమాధానం ఇస్తూ, కొన్ని పార్కులు కార్పొరేషన్, మరికొన్ని ప్రైవేట్ నిర్వహణకు చర్యలు చేపట్టామన్నారు. నిబంధనలు పాటించకపోతే అనుమతి రద్దు చేస్తామని హెచ్చరించారు. వీధుల పేర్ల మార్పు విషయంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మనాలిజోన్ లోని చెరువును పడవ సవారి కేంద్రంగా తీర్చిద్దేందుకు చర్యలు తీసుకున్నారు. బ్రాడ్‌వే బస్‌స్టేషన్ పనుల నేపథ్యంలో ప్లాట్‌ఫామ్ దుకాణాల తొలగించే దిశగా నిర్ణయాలతోపాటు సమావేశంలో 117 అంశాలకు సంబంధించి తీర్మానాలు చేసి ఆమోదించారు.


