ఢిల్లీకి రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం
సాక్షి, చైన్నె : రాష్ట్ర ఎన్నికల అధికారులు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర ఎన్నికల నిర్వహణ విషయంగా కేంద్ర ఎన్నికల కమిషన్ వర్గాలు రాష్ట్ర అధికారులతో చర్చించేందుకు నిర్ణయించాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మార్చిలో మోగే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడ్డాయి. ఏప్రిల్‌లో ఎన్నికలు ముగించి మే మొదటి వారంలో ప్రభుత్వం కొలువు దీరే రీతిలో కార్యచరణ సాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను ముగించి నమూనా ఓటరు జాబితాను ప్రకటించారు. ఇందులో పేర్లు లేని వారు మళ్లీ తమ పేర్లను చేర్చుకునేందుకు వీలు కల్పించారు. ఈ ప్రక్రియ 30వ తేదీతో ముగియనున్నది. తుది ఓటరు జాబితాను ఫిబ్రవరి రెండో వారంలో విడుదల చేయనున్నారు. అలాగే రాష్ట్రంలో ఎన్నికలకు ఉపయోగించే ఈవీఎంల పరిశీలన ప్రక్రియ వేగంగా జరుగుతూ వస్తోంది. ఈ పరిస్థితులలో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించేందుకు ఢిల్లీ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారులకు పిలుపు రావడం గమనార్హం. ఫిబ్రవరి మొదటి వారంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ నేతృత్వంలోని అధికారుల బృందం ఢిల్లీ వెళ్లనున్నారు.ఈ దృష్ట్యా, రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సమగ్ర వివరాల నివేదిక కసరత్తులకు తుది మెరుగులను దిద్దుతున్నారు. జిల్లాల నుంచి ఇప్పటికే అన్ని సమాచారాలు తెచ్చుకున్న అర్చనా పట్నాయక్, తన బృందంతో ఢిల్లీ వెళ్లేందుకు సన్నదం అవుతున్నారు. ఈ భేటీ తదుపరి రెండో వారంలో కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారుల బృందం చైన్నెకు రాబోతున్నది. ఇక్కడ రెండు రోజుల పాటూ సమావేశాలు జరగనున్నాయి. గుర్తింపు పొందిన రాజకీయ పక్షాలతో ఓ రోజు, అధికారులతో మరో రోజు సమావేశం జరగనున్నది. ఈ దృష్ట్యా, రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకున్నట్లయ్యింది.


