సవాళ్లను అధిగమించండి
వేలూరు: జీవితం, వ్యాపారంలో సవాళ్లకు పరిష్కార మార్గాలను కనుగొనే వారు తప్పక విజయం సాధిస్తారని వేలూరు వీఐటీ యూనివర్సిటీటీ చాన్సలర్ విశ్వనాధన్ అన్నారు. వీఐటీలో పూర్వ విద్యార్థుల సంఘం 31వ వార్షికోత్సవం చాన్సలర్ అధ్యక్షతన నిర్వహించారు. కెవిన్‌కోర్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సీకే రంగనాధన్ ముఖ్య అతిథిగా మాట్లాడారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు భయపడక ధైర్యంగా ఎదుర్కొని, వాటిని అధిగమించాలన్నారు. తాను 18 నెలలుగా కృత్రిమ మేధను చురుగ్గా వినియోగిస్తున్నానని, అయితే ఏఐ కూడా తప్పులు చేస్తోందని పేర్కొన్నారు. చాన్సలర్ మాట్లాడుతూ, తాము దేశానికి, సమాజానికి సేవ చేస్తూ ప్రపంచంలోని ఉత్తమ కంపెనీలతో పోటీ పడే దిశగా సాగుతున్నామని పేర్కొన్నారు. మన దేశంలోఓ 22 లక్షల మంది మెడిసిన్ చదవాలనుకుంటే కేవలం 1.25 నుంచి 1.28 లక్షల మంది మాత్రమే అర్హత సాధిస్తారన్నారు. అయితే అడ్మిషన్ అనంతరం పలు సీట్లు ఖాళీగా ఉంటున్నట్టు చెప్పారు. అనంతరం పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో వీఐటీ ఉపాధ్యక్షులు శంకర్ విశ్వనాధన్, శేఖర్ విశ్వనాధన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంధ్య పెంటారెడ్డి, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కాదంబరి విశ్వనాధన్, రమణి బాలసుందరం, వైస్ చాన్సలర్ కాంచన, అసోసియేట్ వైస్ చాన్సలర్ పార్థ సారథి మల్లిక్, రిజిస్ట్రార్ జయభారతి, పూర్వ విద్యార్థుల సంఘం డైరెక్టర్ కార్తికేయన్ తదితరులు పాల్గొన్నారు.


