లక్ష్యాలను సాధించడంలో మహిళలు కీలక పాత్ర పోషించాలని సీఎం
నిర్భయంగా అడుగేయండి..
నేనున్నానంటూ భరోసా
గిండిలో బ్రహ్మాండ చిల్డ్రన్స్ ఆస్పత్రి
హెచ్‌పీవీ టీకాలకు శ్రీకారం
పింక్ బస్సులు, ఆటోలకు జెండా ఊపుతున్న సీఎం స్టాలిన్
సాక్షి, చైన్నె: చైన్నె నందంబాక్కం ట్రేడ్ సెంటర్‌లో మంగళవారం తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రాజెక్టుల అమలు విభాగం నేతృత్వంలో రెండురోజుల పాటూ ప్రపంచ మహిళ ఉపాధి, భద్రత పేరిట ఉమెన్స్ సమ్మిట్ 2026 ప్రారంభమైంది. రాష్ట్రాన్ని ఆర్థికంగా సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో మహిళల భాగస్వామ్యం, భద్రతే లక్ష్యంగా జరుగుతున్న ఈ సదస్సును సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. అలాగే తమిళనాడు మహిళా ఉపాధి, భద్రత(టీఎన్‌డబ్ల్యూఈ సేఫ్) నినాదంతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొత్తంగా రూ. 5 వేల కోట్లు విలువైన సంక్షేమ పథకాలను పంపిణీ చేశారు. ఇందులో ప్రపంచ బ్యాంకు సాయంతో రూ. 1,185 కోట్ల ఆర్థిక సహాయం పంపిణి చేశారు. మహిళల కోసం వివిధ వాహన సేవలను ప్రారంభించారు. సీఎం మహిళా అరుణోదయం పేరిట యాత్ర చేపట్టడంతో పాటూ మహిళల కోసం ప్రత్యేక పది పింక్ బస్సులకు జెండా ఊపారు. పింక్ ఆటోలను పంపిణీ చేశారు. అబలల భద్రత కోసం పింక్ జీపులను మహిళా పోలీసులకు అందజేశారు. పారిశ్రామిక రంగంలో..
భాగస్వామ్యాన్ని మెరుగుపరిచే సహకారాన్ని బలోపేతం చేయడానికి ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ సమక్షంలో అవగాహన ఒప్పందాలు జరిగాయి. నాన్ మొదల్వన్ పథకం కింద నైపుణ్య శిక్షణ పొంది ఉద్యోగాలు దక్కించుకున్న మహిళలకు నియామక ఉత్తర్వులను అందజేశారు. తమిళనాడు మహిళా అభివృద్ధి సంస్థ, అంబేడ్కర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పథకం, టాడ్కో, సీఎం అరైస్ పథకం, కలైంజర్ క్రాఫ్ట్ స్కీమ్ సహా వివిధ పథకాల కింద మహిళలు వ్యాపారాలు ప్రారంభించడానికి రుణాలను ఈసందర్భంగా పంపిణీ చేశారు. వివిధ విభాగాలు, సంస్థలు, మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఆయన సందర్శించారు. ఈ మహిళా సదస్సులో రాష్ట్ర ప్రణాళిక కమిటీ, రాష్ట్ర మహిళలు కమిషన్, పరిశ్రమ ప్రతినిధులు, పౌర సమాజ సంస్థలు విధాన చర్చలు, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత, కార్యాలయ భద్రత, నిర్వహణ సేవలకు సంబంధించి చర్చలు, ముఖ్యంగా మహిళా వ్యవసాయ రంగం నుండి, అనధికారిక, అధికారిక ఉపాధి రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సమావేశంలో డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్, మంత్రులు అన్బరసన్, గీతాజీవన్, ఎం. సుబ్రమణియన్, సీఎం మురుగానందం, ఎంపీ తమిళచ్చి తంగ పాండియన్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా చైన్నెలో గిండిలోని కింగ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్‌లో రూ. 417 కోట్ల అంచనా వ్యయంతో పిల్లల కోసం హై–స్పెషాలిటీ ఆసుపత్రి, పరిశోధనా కేంద్ర భవనానికి సీఎం స్టాలిన్ శంకుస్థాపన చేశారు. అలాగే ఆస్పత్రి నమూనాను ఆవిష్కరించారు. అలాగే గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి మొదటి అడుగుగా ధర్మపురి, పెరంబలూరు, తిరువణ్ణామలై , అరియలూర్ జిల్లాలలో 30,209 మంది పాఠశాల విద్యార్థినులకు హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) టీకాలు వేసే కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. తమిళనాడు క్యాన్సర్ నివారణ, సంరక్షణ ఉద్యమం కార్యాచరణ ప్రణాళికకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సంతకం చేశారు.
మహిళలకు సీఎం స్టాలిన్ పిలుపు
పురుషులతో సమానంగా..
మహిళా సదస్సులో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, సీ్త్రలు పురుషులతో సమానంగా ముందడుగు వేయాలని, అభివృద్ధి చెందుతున్న వివిధ రంగాలలో సైతం రాణించాల్సిన అవశ్యం ఉందన్నారు ఉన్నత పదవుల్లో సీ్త్రలు పురుషులతో సమానంగా ఎదగాలని ఆకాంక్షించారు. అందుకే ప్రపంచ బ్యాంక్ ద్వారా రూ.1,185 కోట్లు తాజాగా తమిళనాడు మహిళా ఉపాధి, భద్రత ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టామన్నారు. ఈ సదస్సు ద్వారా సృజనాత్మక ఆలోచనలు , ప్రణాళికలు లక్ష్యాలను నెరవేర్చే విధంగా తీర్చిదిద్దాలని సూచించారు.
ఈ సమాజానికి సీ్త్రలే వెన్నెముక అని పేర్కొంటూ, గతంలో దివంగత నేతలు పెరియర్, అన్నా, కలైంజ్ఞర్ కరుణానిధిలు మహిళా సంక్షేమం, హక్కుల కోసం చేసిన కృషిని గుర్తు చేశారు. మహిళల సామాజిక స్థితి, జీవనోపాధికి ప్రభుత్వం తాజాగా అందిస్తున్న పథకాలను వివరించారు. ప్రస్తుతం మహిళా పారిశ్రామిక వేత్తలను తీర్చిదిద్దే దిశగా కార్యాచరణను వేగవంతం చేశామన్నారు. మహిళల నేతృత్వంలో స్టార్టప్‌ల వైపుగా విస్తృత చర్యలు చేపట్టామని వివరించారు. గర్భాశయ వ్యాధులను అరికట్టే విధంగా బాలికలకు టీకాల పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. రొమ్ము క్యాన్సర్ సహా, వివిధ క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు వీలుగా 38 మొబైల్ అంబులెన్స్ ద్వారా వెల్‌నెస్ ఆన్ వీల్స్ పేరుతో పరిశోధనలు విస్తృతం చేశామన్నారు. రానున్న రోజులలో మహిళలకు ఉద్యోగ పరంగా మరింత విస్తృత ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రత్యేక ప్రణాళిక సన్నద్ధం అవుతోందని ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ, మహిళ నేతృత్వంలో ‘ది వరల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ‘ అనే అంతర్జాతీయ సమావేశానికి కూడా చర్యలు తీసుకున్నామన్నారు. తమిళనాడు ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసమే పని చేస్తున్నదని పేర్కొంటూ ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి పాఠశాలు, కళాశాలల వరకు, ఉద్యోగిగా, గృహిణిగా మహిళలు అన్ని రంగాలలో రాణించడమే కాదు, వారి సంరక్షణ లక్ష్యంగా టీఎన్‌డబ్ల్యూఈ సేఫ్ పథకాన్ని రూపొందించామని వివరించారు.
లక్ష్యాలను సాధించడంలో మహిళలు కీలక పాత్ర పోషించాలని సీఎం
లక్ష్యాలను సాధించడంలో మహిళలు కీలక పాత్ర పోషించాలని సీఎం
లక్ష్యాలను సాధించడంలో మహిళలు కీలక పాత్ర పోషించాలని సీఎం


