టీఏపీఎస్‌కు ఆమోదం
సాక్షి, చైన్నె : తమిళనాడు అష్యూర్డ్ పెన్షన్ స్కీమ్ (టీఏపీఎస్ – హమీతో కూడిన పెన్షన్ పథకం)ను అమలుకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు మంగళవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం సచివాలయంలో జరిగింది. సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ నేతృత్వం వహించారు. మంత్రులు, ఆయా శాఖల అధికారులు అందరూ హాజరయ్యారు. ఇందులో అసెంబ్లీ సమావేశాల గురించి తొలుత చర్చించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈనెల 20వ తేదీన కొత్త సంవత్సరంలో తొలి అసెంబ్లీ సమావేశం కానుంది. ఇందులో గవర్నర్ ఆర్‌ఎన్ రవి ప్రసంగించనున్నారు. ప్రతి ఏటా వివాదాల నడుమ ప్రసంగం సాగుతున్న నేపథ్యంలో ఈసారి ఇది పునరావృతం కాకుండా కసరత్తులకు సిద్ధమయ్యారు. గవర్నర్ ప్రసంగంలో పొందు పరచాల్సిన అంశాలను గురించి చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ప్రసంగానికి అనుమతి ఇస్తూ చర్యలు చేపట్టారు. తాజా ప్రభుత్వంలో ఇదే చివరి సమావేశం కానున్నడంతో, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తాత్కాలిక బడ్జెట్‌ను ఈ సమావేశాలలో దాఖలు చేయడానికి కెబినెట్‌లో ఆమోద ముద్ర వేసినట్టు అధికారులు పేర్కొంటున్నారు.
ఆమోదం
ఫిబ్రవరి లేదా మార్చిలో నగారా మోగ వచ్చు అన్న సంకేతాల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలలో ప్రజల్ని ఆకర్షించే బడ్జెట్‌గా దీనిని తీర్చిదిద్దేందుకు సిద్ధమయ్యారు. మంత్రి వర్గం భేటీలో కీలకంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం రెండు రోజుల క్రితం ప్రకటించిన తమిళనాడు అష్యూర్డ్ పెన్షన్ స్కీమ్(టీఏపీఎస్ – హమీతో కూడిన పెన్షన్ పథకం)కు ఆమోద ముద్ర వేశారు. అలాగే, తాజాగా అమలులలో ఉన్న పథకాలను మరింత విస్తృరించడమే కాకుండా, కొత్త ప్రాజెక్టులు, పరిశ్రమలకు అనుమతులు ఇస్తూ తాజా కేబినెట్ భేటీలో ఆమోద ముద్ర వేసినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే, ప్రజల కోసం ప్రత్యేకంగా అభిప్రాయాల సేకరణ, సూచనలను స్వీకరించేందుకు ప్రత్యేక ప్రాజెక్టు అమలుకు సిద్ధమయ్యారు. మీ కలల ప్రాజెక్టు గురించి మీరే చెప్పండి అన్న నినాదంతో విద్యార్థుల కోసం ప్రత్యేక పథకంఅమల్లోకి రానున్నట్టు ఈసందర్భంగా మంత్రి అన్బిల్ మహేశ్ పేర్కొన్నారు.
సీఎంకు కృతజ్ఞతలు
కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థుల కోసం ప్రపంచం మీ చేతుల్లో నినాదంతో ల్యాప్‌టాప్ పంపిణీ పథకాన్ని సీఎం స్టాలిన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి విడతగా 10 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్ టాప్‌లను పంపిణి చేశారు. మరో పది లక్షల మందికి త్వరలో అందజేయనున్నారు. ఈ పరిస్థితులలో క్వీన్ మేరీ కళాశాలకు చెందిన విద్యార్ధినులు అనేక మంది సీఎం స్టాలిన్‌ను కలిశారు. తమకు ల్యాప్ టాప్‌లు ఇచ్చి నందుకు ఆనందం వ్యక్తం చేస్తూ, కృతజ్ఞతలు తెలియజేశారు.
టీఏపీఎస్‌కు ఆమోదం


