రూ.4 లక్షల కోట్లు దోచేశారు!
డీఎంకేపై అన్నాడీఎంకే తీవ్ర ఆరోపణలు
శాఖల వారీగా అవినీతి జాబితా తయారీ
విచారణకు ఆదేశించాలని గవర్నర్‌కు పళణి వినతి
సాక్షి, చైన్నె: నాలుగున్నర సంవత్సరాల పాటూ డీఎంకే పాలనకు రూ. 4 లక్షల కోట్లు దోచేశారని, ఆ మేరకు శాఖల వారీగా అవినీతి, అక్రమాలు జరిగినట్టు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి కె పళణి స్వామి ఆరోపించారు. శాఖల వారీగా అవినీతి జాబితాతో కూడిన నివేదికను మంగళవారం సీఎం స్టాలిన్‌కు పళణి స్వామి అందజేశారు. వివరాలు.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి నేతృత్వంలో ఆ పార్టీ నేతలు కేపీ మునుస్వామి, దిండుగల్ శ్రీనివాసన్, ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం, జయకుమార్, తంగమణి మంగళవారం రాజ్ భవన్‌కు వెళ్లారు. గవర్నర్ ఆర్‌ఎన్ రవితో భేటీ అయ్యారు. అర్ధగంట పాటూ జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ అవినీతి అక్రమాల జాబితా పేరిట శాఖల వారీగా వివరాలతో కూడిన నివేదికను అందజేశారు. ఇందులో ఆయా శాఖలలో ఏ మేరకు అవినీతి జరిగిందో, ఎవ్వరెవ్వరికి ఏ మేరకు కమిషన్లు ముట్టాయో అన్న వివరాలను పొందు పరిచారు.
కమిషన్ విచారణకు పట్టు
నాలుగున్నర సంవత్సరాల డీఎంకే పాలన అంతా అవినీతిమయం అని గవర్నర్‌తో భేటీ అనంతరం పళణి స్వామి మీడియా ముందు ఆరోపించారు. శాఖల వారీగా ఏ మేరకు అవినీతి జరిగిందో అన్న సమగ్ర వివరాలతో జాబితాలో పొందు పరిచి ఉన్నామన్నారు. ఆయా శాఖలలో ఎవ్వరెవ్వరికి ఏ మేరకు అక్రమార్జన ముట్టిందో అన్న వివరాలు సైతం సేకరించామని వివరించారు. మొత్తం రూ.4 లక్షల కోట్లను దోచేసే విధంగా అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ నివేదిక ఆధారంగా విచారణ కమిషన్ నియమించాలని గవర్నర్‌ను కోరినట్టు తెలిపారు. ఈ విచారణ అన్నది సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలోనే జరగాలని కోరినట్టు పేర్కొన్నారు. డీఎంకేకు ఓటమి భయం వచ్చేసిందని వ్యాఖ్యలు చేశారు. అందుకే తాజాగా వరుస పథకాలను ప్రకటిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. ఎన్నికలలో ప్రజల మద్దతు తగ్గడం ఖాయం అని గ్రహించే, తాజాగా ప్రజలను మోసం చేసే విధంగా పథకాలు, సంక్రాంతి కానుక రూ. 3 వేలు అంటూ ప్రకటనల ఉత్తర్వులు జారీ చేస్తున్నారన్నారు. 2021 ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలలో కనీసం ఒక వంతు కూడా అమలు చేయలేదని, అందుకే నేడు అన్ని వర్గాలు రోడ్డు మీదకు వచ్చి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తమిళనాడు తాజాగా పోరాటాలకు వేదికగా మారిందన్నారు. డీఎంకే ఎమ్మెల్యేకు చెందిన ఆస్పత్రిలో కిడ్నీ స్కాం జరిగిందన్నది నివేదిక ద్వారా సైతం తేటతెల్లమైనా , ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం బట్టి చూస్తే, ఏ మేరకు అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయో స్పష్టమవుతోందని పేర్కొన్నారు.


