కనులపండువగా ఆరుద్ర మహోత్సవం
శివాలయాల్లో ఉత్సవం
వేలూరు: వేలూరు, తిరువణ్ణామలై, చిదంబరంలోని ఆలయాల్లో తమిళ మార్గళి మాస తిరువాద్రి నక్షత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరుద్ర దర్శనం కల్పించారు. తిరువాద్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని అన్ని శివాలయాల్లోని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి భక్తుల నడుమ ఊరేగించారు. పూజల అనంతరం ఆలయంలోని నటరాజ పెరుమాల్‌కు 18 రకాల ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమిళ మార్గలి మాసంలో ఆరుద్ర దర్శనాన్ని పురస్కరించుకుని తిరువణ్ణామలైలోని వేయి కాళ్ల మండపంలో నటరాజ పెరుమాల్‌కు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం మహా దీపంలో వెలిగించిన దీప కాటుకను నటరాజర్ స్వామికి పెట్టి శివాచార్యులు పూజలు చేశారు. అనంతరం ఆలయంలోని భక్తులకు దీపం కాటుకను ప్రసాదంగా అందజేసి స్వామి వారిని తిరుమంజన గోపురం దారిలో భక్తుల దర్శనార్థం ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అదేవిధంగా వేలూరు కోట మైదానంలోని జలకంఠేశ్వరాలయంలోని నటరాజర్‌స్వామికి ఉదయం 5 గంటలకు ప్రత్యేక పూజలు చేసి భక్తుల దర్శనార్థం ఊరేగించారు. శుక్రవారం సాయంత్రం నుంచి పౌర్ణమి కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరాలయం వెనుక ఉన్న మహాదీపం కొండ చుట్టూ 14 కిలోమీటర్లు దూరం నడిచి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. దీంతో మాడ వీధులు, ఆలయం భక్తులతో కిటకిటలాడింది.
చిదంబరంలో అరుద్ర దర్శన మహోత్సవం
కడలూరు జిల్లా చిదంబరంలోని నటరాజస్వామి ఆలయం పంచభూతాలతో ఆకాశ స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మార్గళి మాసంలో ఆరుద్ర దర్శనం మహోత్సవం గత నెలాఖరు నుంచి జరుగుతున్నాయి. ఉత్సవాలలో అత్యంత ముఖ్య ఘట్టంగా రథోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. శనివారం ఆరుద్ర దర్శన మహోత్సవం కనులపండువగా జరిగింది. సాయంత్రం ఆలయం ఆవరణలో ఆరుద్ర దర్శన మహోత్సవం జరిగింది. వేలాదిగా భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.
కనులపండువగా ఆరుద్ర మహోత్సవం
కనులపండువగా ఆరుద్ర మహోత్సవం


