జోరుగా.. హుషారుగా..!
గుడిపాల: మండలం మీదుగా బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మన రాష్ట్రం నుంచి తమిళనాడుకు పచ్చిబియ్యం, తమిళనాడు నుంచి ఆంధ్రాకు ఉప్పుడు బియ్యం గుట్టు చప్పుడు కాకుండా రవాణా చేస్తున్నారు. కొంతమందికి ఇదే జీవనాధారంగా ఎంచుకుని జోరుగా స్మగ్లింగ్ చేస్తున్నారు. గతంలో ఆటోలు, మినీవ్యాన్లు, టాటాఏస్ వాహనాల్లో రవాణా చేసేవారు. ప్రస్తుతం పోలీసులు తనిఖీలు ముమ్మరం చేయడంతో రూట్ మార్చారు. ద్విచక్ర వాహనాల్లో తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్‌షాపుల్లో బియ్యాన్ని కార్డుదారులకు పంపిణీ చేస్తోంది. కొంతమంది కార్డుదారుల వద్దకు వెళ్లి కిలో బియ్యాన్ని రూ.12కు తీసుకుని ఇదే బియ్యాన్ని తమిళనాడుకు తీసుకెళ్లి 20 రూపాయలకు విక్రయిస్తున్నారు. మరి కొందరు మంది తమిళనాడులో ఉప్పుడు బియ్యాన్ని కిలో రూ.10కి తీసుకువచ్చి ఇక్కడ రూ.20కి విక్రయిస్తున్నారు. ప్రతిరోజూ ఈ తంతు అటూ..ఇటూ ద్విచక్ర వాహనాల్లో రవాణా సాగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. వీటిపై పూర్తిగా నిఘా కొరవడంతో ఎంచక్కా అక్రమ రవాణాతో జేబులు నింపుకుంటున్నారు.


