భూత వాహనంలో అరుణాచలేశ్వరుడు
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన బుధవారం చంద్రశేఖరుడిని భూత వాహనంలో మాడ వీధుల్లో ఊరేగించారు. మంగళవారం రాత్రి వెండి, ఇంద్ర వాహనంలో పంచమూర్తులైన వినాయకుడు, చంద్రశేఖరుడు, సుబ్రమణ్యస్వామి, అన్నామలై, ఉన్నామలై అమ్మవార్లు భక్తులకు మాడ వీధుల్లో పుష్పాలంకరణ మధ్య దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో వచ్చిన పంచమూర్తులకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అరుణాచలేశ్వరునికి హరోంహరా నామస్మరణంతో హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం బుధవారం ఉదయం వినాయకుడు, చంద్రశేఖరుడి ఉత్సవ మూర్తులను ఆలయ ప్రాంగణం నుంచి రాజగోపురం ఎదురుగా ఉన్న 16 కాళ్ల మండపం వద్దకు తీసుకొచ్చారు. మధ్యాహ్నం పంచ మూర్తులకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి వివిధ వాహనాల్లో ఊరేగించారు. అనంతరం ఉన్నామలై సమేద అన్నామలైయార్ స్వామి వార్లును భూత వాహనంలో మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. అదేవిధంగా ఆలయంలోని అరుణాచలేశ్వరునికి శివాచార్యుల వేద మంత్రాల నడుమ 1008 శంఖాలతో శంఖాభిషేకం నిర్వహించారు. సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. బుధవారం రాత్రి మూషిక వాహనంలో వినాయకుడు, నెమలి వాహనంలో సుబ్రమణ్య స్వామి, సింహ వాహనంలో ఉన్నామలై అమ్మన్ సమేత అన్నామలైయార్, వెండి అన్న వాహనంలో పరాశక్తి అమ్మవారు, వెండి వృషభ వాహనంలో చండికేశ్వరుడు మాడ వీధుల్లో ఊరేగారు.
ప్రత్యేక హుండీల ఏర్పాటు
బ్రహ్మోత్సవాలకు భక్తుల రద్దీ అధికంగా రావడంతో దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయంలోనూ, మాడ వీధులు, ఆలయ ప్రాంగణం, గిరివలయం రోడ్డు తదితర ప్రాంతాల్లో తాత్కాలిక హుండీల కోసం శివాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అఽధికారులు కేటాయించిన ప్రాంతాల్లో ప్రత్యేక హుండీలను ఏర్పాటు చేశారు.
భూత వాహనంలో అరుణాచలేశ్వరుడు


