269 కొత్త అపార్ట్‌మెంట్ల నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

269 కొత్త అపార్ట్‌మెంట్ల నిర్మాణం

Nov 27 2025 6:15 AM | Updated on Nov 27 2025 6:15 AM

269 కొత్త అపార్ట్‌మెంట్ల నిర్మాణం

269 కొత్త అపార్ట్‌మెంట్ల నిర్మాణం

● ప్రారంభించిన మంత్రి శేఖర్‌బాబు ● డిసెంబర్‌ 5న పర్యటన ● రాజకీయ నేతగా తొలి ప్రయాణం ● 15 చోట్ల సోదాలు

● ప్రారంభించిన మంత్రి శేఖర్‌బాబు

కొరుక్కుపేట: పోర్ట్‌ కాంప్లెక్స్‌లో రూ. 55 కోట్ల అంచనా వ్యయంతో 269 కొత్త అపార్ట్‌మెంట్ల నిర్మాణాన్ని హిందూ ధర్మాదాయ శాఖ మంత్రి పీజే శేఖర్‌ బాబు ప్రారంభించారు. తమిళనాడులో నివసిస్తున్న పట్టణ పేద కుటుంబాలకు అన్నీ కలిసిన గృహ సౌకర్యాలను అందించడానికి 1970లో కలైంగర్‌ దీనిని ప్రారంభించారు. 1995లో నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరుకుంది . దీంతో ఈ ప్రాజెక్ట్‌ కింద రూ. 54.11 కోట్ల అంచనా వ్యయంతో 9 అంతస్తులతో కూడిన 269 కొత్త అపార్ట్‌మెంట్‌ భవనాలను నిర్మించాల్సి ఉంది. ఈ కొత్త నివాసాలు, ఒక్కొక్కటి 411 చదరపు అడుగుల విస్తీర్ణంలో, బహుళార్ధసాధక గది, పడకగది, వంటగది, టాయిలెట్‌తో నిర్మిస్తారు. ఇంకా అన్ని నివాస సముదాయాలలో టార్మాక్‌ రోడ్లు, తాగునీటి సౌకర్యాలు మురుగునీటి పారవేయడం ఉంటాయని మంత్రి శేఖర్‌బాబు వెల్లడించారు. వర్షపు నీటి సంరక్షణ నిర్మాణం, ఎలక్ట్రిక్‌ హాయిస్ట్‌ వంటి సౌకర్యాలతో ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్నారు. మేయర్‌ ప్రియ, తమిళనాడు పట్టణాభివృద్ధి, పట్టణాభివృద్ధి నిర్వహణ డైరెక్టర్‌ శ్రేయ పి. సింగ్‌, చైన్నె కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌ కట్టా రవితేజ, చైన్నె కార్పొరేషన్‌ రాయపురం జోనల్‌ కమిటీ చైర్మన్‌ శ్రీరాములు పాల్గొన్నారు.

పుదుచ్చేరికి విజయ్‌

సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్‌ రాజకీయ పార్టీ ఆవిర్భావంతో తొలిసారిగా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో తన బలాన్ని చాటుకునేందుకు సిద్ధమయ్యారు. డిసెంబరు 5వ తేదీన ఆయన పుదుచ్చేరిలో రోడ్‌ షో నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇందు కోసం అనుమతి ఇవ్వాలని ఆ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో టీవీకే వర్గాలు వినతిపత్రం బుధవారం సమర్పించాయి. రాజకీయ పార్టీ ఆవిర్భావంతో పూర్తిగా తన దృష్టిని తమిళనాడుపైన విజయ్‌ పెట్టిన విషయం తెలిసిందే. ఇక్కడి ఓటర్లకు దగ్గరయ్యే విధంగా చేపట్టిన మీట్‌ దీ పీపుల్‌ ప్రయాణానికి కరూర్‌ విషాద ఘటన రూపంలో బ్రేక్‌ పడింది. డిసెంబర్‌ 4 నుంచి సేలం వేదికగా మళ్లీ ఈ పర్యటనకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైనా, కార్తీక దీపోత్సవాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో తనను కలిసేందుకు సిద్ధంగా ఉన్న ప్రజల వద్దకే వెళ్లే విధంగా విజయ్‌ ముందుకు సాగుతున్నారు. గత వారం కాంచీపురం ప్రజల్ని కలిశారు. ఈ పరిస్థితులలో రాజకీయ పార్టీ ఆవిర్భావంతో తన దృష్టిని తాజాగా పుదుచ్చేరిపై కూడాపెట్టే పనిలో పడ్డారు. డిసెంబరు 5న పుదుచ్చేరిలో రోడ్‌ షో, ర్యాలీ, బహిరంగ సభకు సన్నద్దమయ్యారు. ఇందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పుదుచ్చేరి టీవీకే వర్గాలు బుధవారం ఆ రాష్ట్ర డీజీపీ షాలిని సింగ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సమగ్ర వివరాలను అందులో తెలియజేశారు. పుదుచ్చేరి పర్యటన ముగించుకుని మరుసటి రోజన కడలూరు వెళ్లేందుకు విజయ్‌ కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టుగా టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి.

ఆరుద్రాపై ఈడీ గురి

సాక్షి, చైన్నె: ఆరుద్రా గోల్డ్‌ పేరుతో వేల కోట్లకు మోసానికి పాల్పడిన సంస్థలకు చెందిన డైరెక్టర్లు, ఇతర నిర్వాహకులను గురిపెట్టి బుధవారం చైన్నె, కాంచీపురం, వేలూరులలో ఈడీ సోదాలు విస్తృతంగా జరిగాయి. ఆరుద్రా గోల్డ్‌ పేరిట రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రూ.2,438 కోట్ల మోసం కేసును ఆర్థిక నేర విభాగం తీవ్రంగా విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో ఎనిమిది మంది అరెస్టయ్యారు. ఇందులో ఆ సంస్థ డైరెక్టర్‌, బీజేపీ నేత హరీష్‌కూడా ఉన్నారు. వీరి వద్ద జరిపిన విచారణలో సినీ నటుడు ఆర్‌కే.సురేష్‌ పేరు తెరపైకి వచ్చింది. ఆయన్ను ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగాయి. విచారణ కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో ఆరుద్రా గోల్డ్‌ మోసాల్లో పెద్ద ఎత్తున మనీలాండరింగ్‌ జరిగినట్టు ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)గుర్తించింది. దీంతో చైన్నె, వేలూరు, కాంచీపురంసహా 15 చోట్ల ఆ సంస్థకు చెందిన కార్యాలయాలు, డైరెక్టర్లు, వారికి సంబంధించిన నివాసాల్లో పలు బృందాలుగా ఈడీ అధికారులు రంగంలోకి దిగి సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. సమగ్ర సోదాల తర్వాత వివరాలను వెల్లడిస్తామని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. అన్ని చోట్ల కేంద్ర నిఘా బృందాల భద్రత నడుమ సోదాలు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement