సెంగొట్టయ్యన్ రాజీనామా
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ఎమ్మెల్యే పదవికి సీనియర్ నేత సెంగొట్టయ్యన్ బుధవారం రాజీనామా చేశారు. ఆ లేఖను అసెంబ్లీ ఛాంబర్‌లో స్పీకర్ అప్పావును కలిసి ఆయన అందజేశారు. కాగా, గురువారం విజయ్ టీవీకేలో సెంగొట్టయ్యన్ చేరబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. వివరాలు.. ఐదు దశాబ్దాలకు పైగా కొంగు మండలంలో అన్నాడీఎంకేలో కీలక నేతలలో ఒకరిగా వ్యవహరించిన కేఏ సెంగొట్టయ్యన్ ఇటీవల అందుకున్న ఐక్య నినాదం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామికి ఆగ్రహాన్ని తెప్పించిన విషయం తెలిసిందే. ఆయన చేతిలో ఉన్నా పార్టీ పదవులు తొలుత లాగేసుకున్నారు. చివరకు ఆయన్ను అన్నాడీఎంకే ప్రాధమిక సభ్యత్వం నుంచి సైతం తొలగించారు. దివంగత నేతలు ఎంజీఆర్, జయలలితకు విశ్వాసపాత్రుడిగా ఉంటూ తొమ్మిది సార్లు అసెంబ్లీకి ఎన్నిక కావడమే కాకుండా, ఐదు సార్లు మంత్రిగా పనిచేసిన తనకు జరిగిన అవమానంపై సెంగొట్టయ్యన్ తీవ్ర మనో వేదనకు లోనయ్యారు. అన్నాడీఎంకే నుంచి బయటకు వెళ్లిన వారందరూ ఐక్యతో ముందుకు సాగితే అధికారం తథ్యమని బీజేపీ పెద్దలు ఇచ్చిన సూచన మేరకు తాను ఐక్య నినాదం అందుకున్నట్టు సెంగొట్టయ్యన్ బహిరంగం గానే ప్రకటించారు. అయితే, అన్నాడీఎంకేలో తనకు జరిగిన అవమానం అనే మనో వేదన నుంచి తేరుకున్న ఆయన బుధవారం తన ఎమ్మెల్యేపదవికి రాజీనామా చేశారు.
టీవీకేలో చేరిక..?
సెంగొట్టయ్యన్ టీవీకేలో చేరబోతున్నట్టు ప్రచారం ఊపందుకుంది. ఎంజీఆర్‌కు సెంగొట్టయ్యన్ అత్యంత వీరాభిమాని. ఆయన్ను చూసే యువ నేతగా రాజకీయాలలోకి సెంగొట్టయ్యన్ ఒకప్పుడు వచ్చారు. ఆయనే ఆదర్శకంగా ముందుకు సాగారు. ఆ తదుపరి దివంగత నేత జయలలిత ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటూ వచ్చారు. తాజాగా పళని స్వామితో ఏర్పడ్డ వైర్యంతో తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసిన సెంగొట్టయ్యన్ టీవీకేలో చేరడం ఖాయం అన్న సంకేతాలు వెలువడ్డాయి. ఎంజీఆర్ బాణిలో విజయ్ ప్రయాణం ఉండడంతో ఆయనకు పక్క బలంగా నిలిచే విధంగా, రానున్న కాలంలో అన్నాడీఎంకే అసంతృప్తి వాదులందర్నీ విజయ్‌కు వైపుగా నిలబెట్టే దిశగా సెంగొట్టయ్యన్ కార్యాచరణ ఉండవచ్చు అన్న చర్చ ఊపందుకుంది. ఆది నుంచి డీఎంకేను వ్యతిరేకించే సెంగొట్టయ్యన్ తాజాగా అదే డీఎంకేకు తానే ప్రధాన ప్రత్యర్థి అని ప్రకటించిన విజయ్ పార్టీలో చేరనుండడం గమనార్హం. కాగా రాత్రి ఆయన విజయ్‌తో సమావేశమైనట్లు తెలిసింది.
స్పీకర్‌కు..
చైన్నెకు వచ్చిన సెంగొట్టయ్యన్ అసెంబ్లీ ఛాంబర్‌లో స్పీకర్ అప్పావును కలిశారు. ఆయనకు తన రాజీనామా లేఖను సమ ర్పించారు. స్పీకర్‌తో మాట్లాడినానంతరం వెలుపలకు వచ్చిన సెంగొట్టయ్యన్ మంత్రి శేఖర్‌బాబుతో సమావేశం కావడం చర్చకు దారి తీసింది. గతవారం అన్నాడీఎంకే ఎమ్మెల్యే మనోజ్ పాండియన్ డీఎంకేలో చేరిన నేపథ్యంలో సెంగొట్టయ్యన్‌ను సైతం డీఎంకే ఆహ్వానిస్తున్నట్టుగా ప్రచారం ఊపందుకుంది. ఈ భేటీ అనంతరం మీడియా సెంగొట్టయ్యన్ తదుపరి రాజకీయ ప్రయాణం గురించి ప్రశ్నించగా నమస్కారిస్తూ ముందుకెళ్లారు. డీఎంకేలో చేరుతారా..? విజయ్ టీవీకేలో చేరుతారా..? అని ప్రశ్నించగా మౌనంగా అదే నమస్కారంతో చిరునవ్వుతో వెళ్లి పోయారు.


