24న డిప్యూటీ సీఎం రాక
–ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నాజర్
తిరువళ్లూరు: జిల్లాలోని అర్హులైన 33 వేల మందికి ఇంటిపట్టాలు సహా వేర్వేరు సంక్షేమ పథకాలను అందజేయడానికి ఈనెల 24న డిప్యూటీ సీఎం ఉధయనిధి స్టాలిన్ ఆవడికి రానున్న క్రమంలో ఏర్పాట్లను రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి నాజర్, కలెక్టర్ ప్రతాప్ శుక్రవారం ఉదయం పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారికి ఇంటి పట్టాలు, స్వయం ఉపాధి సంఘాలకు రుణాలు, దివ్యాంగులకు మూడుచక్రాల వాహనం, రైతులకు సబ్సిడీ విత్తనాలను పథకాలను అందజేయనున్నారు. దీంతోపాటు జిల్లాలోని వేర్వేరు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ఇప్పటికే పూర్తయిన పనులకు ప్రారంభోత్సవం చేసి అందుబాటులోకి తేనున్నారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి రానున్న క్రమంలో భారీగా ఏర్పాట్లను చేస్తున్నారు. లబ్ధిదారులు, అధికారులు, రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కూర్చునే విధంగా భారీ ఏర్పాట్లను శరవేగంగా నిర్వహిస్తున్నారు. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నాజర్ ఆదివారంలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆవడి పోలీసు కమిషనర్ శంకర్, అదనపు కమిషనర్ భవానీశ్వరీతో కలిసి ట్రాఫిక్, వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన స్థలాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ ప్రతాప్, ఆవడి కమిషనర్ శరణ్య, మేయర్ ఉదయకుమార్ పాల్గొన్నారు.


