
చోరీకి పాల్పడ్డ ముద్దాయి అరెస్టు
కుప్పం: రామకుప్పం మండలం, చెల్దిగానిపల్లి గ్రామంలో పట్టపగలు ఓ ఇంట్లో చోరబడి చోరీకి పాల్పడ్డ ముద్దాయిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ పార్థసారథి తెలిపారు. శనివారం డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమిళనాడు రాష్ట్రం, అంబూరు సమీపంలోని ఉదఎందిరం గ్రామానికి చెందిన రాజేంద్ర కుమారుడు గోడ్విన్ మోసెస్ రాజేంద్రణ్ అలియాస్ కడిష్ రామకుప్పం, వి.కోట ప్రాంతాల్లో సంచరిస్తూ దోంగతనాలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో వారం క్రితం చెల్దిగానిపల్లి గ్రామంలో ఓ ఇంట్లో చొరబడి 95 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. దీంతో పాటు గతంలో వి కోటలో జరిగిన దొంగతనం కేసులోనూ కడిష్ ముద్దాయిగా ఉన్నాడు. ఇతని వద్ద నుంచి 123.3 గ్రాముల బంగారు నగలు, కత్తి, రాడ్లు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఇతనిపై తమిళనాడులో ఇప్పటి వరుకు 30 కేసులు ఉన్నాయన్నారు. డీఎస్పీ వెంట సీఐ మల్లేష్‌యాదవ్, ఎస్‌ఐలు వెంకటమోహన్, నరేష్, శ్రీనివాసులు ఉన్నారు.