
క్లుప్తంగా
21న కందషష్ఠి ఉత్సవం
తిరువొత్తియూరు: మురుగన్‌ను ఇష్టమైన రోజు ఒకటి షష్ఠి. ఐపసి మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథిని మురుగన్‌కు సంబంధించిన మహా కందషష్ఠిగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో చైన్నెలోని వడపళని మురుగన్ ఆలయంలో ఈ ఏడాది మహాకంద షష్ఠి ఉత్సవం 21వ తేదీన ప్రారంభం కానుంది. అనంతరం ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పూజలు జరుగుతాయి. ఉత్సవాల ప్రధాన రోజు 27వ తేదీ రాత్రి 8 గంటలకు సూరసంహారం కార్యక్రమం జరుగుతుంది. 28వ తేదీ రాత్రి 7 గంటలకు వళ్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి తిరుకల్యాణ ఉత్సవం, స్వామి వీధి ఉత్సవం నిర్వహిస్తారు.
పసికందు విక్రయం
తిరువొత్తియూరు: ఆర్.కె.పేట సమీపంలోని జి.సి.ఎస్.కండ్రిగ ప్రాంతానికి చెందిన మాయ (30) అనే ట్రాన్స్‌జెండర్. కొన్ని రోజుల క్రితం 2 నెలల ఆడబిడ్డను తిరువళ్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి ఆరోగ్య సమస్యల కారణంగా చికిత్స కోసం తీసుకెళ్లారు. అప్పుడు డాక్టర్లు ఆ బిడ్డ ఎవరిదని అడిగారు. దానికి మాయ పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. వెంటనే ఆస్పత్రి అధికారులు తిరువళ్లూరు జిల్లా బాలల సంక్షేమ అధికారి మలర్విళికి సమాచారం అందించారు. ఆమె ఆర్.కె.పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు అక్కడికి చేరుకుని మాయ వద్ద విచారణ చేశారు. ఆమె తన బంధువు నాగమణి సాయంతో ఆంధ్రప్రదేశ్ నుంచి 2 నెలల చిన్నారిని రూ.3 లక్షల 10 వేలకు కొనుకొన్నట్లు తెలిసింది. పోలీసులు ఆ ఆడబిడ్డను రక్షించి, జిల్లా బాలల సంక్షేమ కేంద్రానికి అప్పగించారు.
కావేరిలో మునిగి వ్యక్తి మృతి
కొరుక్కుపేట: కావేరి నదిలో స్నానం చేస్తూ ఓ వ్యక్తి మృతిచెందాడు. చైన్నెలోని ఆర్కే నగర్‌లోని తాండరపేటై నివాసి స్వామినాథన్. ఇతని కుమారుడు ప్రభు (38) ఆటోడ్రైవర్. ఈక్రమంలో శుక్రవారం, ప్రభు 10 మంది స్నేహితులతో కలిసి హొగ్నేకల్‌కు విహారయాత్రకు వెళ్లాడు. వివిధ ప్రదేశాలను సందర్శించారు. అనంతరం వారు తమ స్నేహితులతో కలిసి కావేరి నదిలో స్నానం చేశారు. ఆ సమయంలో ప్రభు లోతైన ప్రాంతానికి వెళ్లాడు. అతనికి ఈత రాకపోవడంతో అతను నీటిలో కొట్టుకుపోయాడు. అతని స్నేహితులు అతన్ని కాపాడడానికి ప్రయత్నించినప్పటికి కాపాడలేకపోయారు. స్నేహితులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నది నుంచి వెలికితీశారు. మృతదేహాన్ని చూసిన స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం బెన్నగరం ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ప్రభుకు భార్య కల్పన, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీవారి సేవలో కేంద్రమంత్రి
తిరుమల: తిరుమల శ్రీవారిని శనివారం కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ సేవించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. టీటీడీ అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు.
రాకెట్ ప్రయోగం మళ్లీ వాయిదా
– నవంబర్ 5వ తేదీకి మార్పు
సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నవంబర్ 5న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్‌వీఎం3–ఎం5 రాకెట్ ద్వారా జీశాట్–7ఆర్ అనే సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. అయితే ఈ ప్రయోగాన్ని ఈనెల 16న చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక పరమైన కారణాలతో 25వ తేదీకి వాయిదా పడింది. మళ్లీ 25 నుంచి నవంబర్ 5కి వాయిదా వేశారు. దీనికి తోడు ఈ ప్రయోగంలో అమెరికాకు చెందిన బ్లాక్–2 బ్లూబర్డ్ అనే ఉపగ్రహాన్ని వాణిజ్యపరంగా ప్రయోగించాల్సి ఉన్నప్పటికీ ఉపగ్రహం రావడం ఆలస్యం కావడంతో జీశాట్–7ఆర్ ఉపగ్రహాన్ని ప్రయోగించాలని అనుకున్నారు. ఇందులో కూడా కొన్ని సాంకేతిక కారణాలతో 25న అనుకున్న జీశాట్–7ఆర్ ప్రయోగాన్ని నవంబర్ నెల 5న ప్రయోగించనున్నారని తెలుస్తోంది. 2013 ఆగస్టు 30న ప్రెంచి గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి పారిస్‌కు చెందిన అరైన్–5 రాకెట్ ద్వారా జీశాట్–7 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ప్రస్తుతం ఆ ఉపగ్రహం కాలపరిమితి అయిపోవడంతో దాని స్థానంలో జీశాట్–7ఆర్ పేరుతో ఉపగ్రహాన్ని పంపనున్నారు.
వైభవంగా ఊంజల్ సేవ
నారాయణవనం: పద్మావతీ సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామివారికి శనివారం సాయంత్రం ఊంజల్ సేవ ఘనంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాత సేవతో ఆలయాన్ని తెరిచిన అర్చకులు నిత్యపూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. సాయంత్రం కై ంకర్యాలను పూర్తి చేసిన అర్చకులు తిరుచ్చి వాహనంపై శ్రీదేవీ, భూదేవీ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారిని కొలువుదీర్చి, ఊంజల్ మండపంలో గంట పాటు నిర్వహించిన ఊంజల్‌సేవ నిర్వహించారు.

క్లుప్తంగా