
శ్రీలంక శరణార్థులకు సహాయకాల పంపిణీ
తిరువళ్లూరు: పెత్తికుప్పంలోని శిబిరంలో ఉన్న శ్రీలంక శరణార్దులకు సుమారు రూ. 21.86 లక్షల విలువ చేసే సహాయకాలను మంత్రి నాజర్ అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న శ్రీలంక శరణార్దులకు వేర్వేరు సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తూ ఉంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా వున్న 105 శిబిరాలో వున్న 19,677 కుటుంబాలకు చెందిన 56,929 మందికి సహాయకాలను అంద జేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే గుమ్మిడిపూండి తాలుకా పెత్తికుప్పంలోని శరణార్దులకు మంత్రి నాజర్ దుస్తులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత నాలుగేళ్లలో ఏటా దుస్తుల పంపిణీ కోసం రూ.19 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. దీంతో పాటు రూ.620 కోట్లతో 10,469 నివాసాలను నిర్మిస్తున్నామని త్వరలోనే వాటిని లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో కమిషనర్ వల్లలార్, కలెక్టర్ ప్రతాప్, ప్రాజెక్టు డైరెక్టర్ జయకుమార్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.