
● రూపకల్పనకు జస్టిస్ కెఎన్ బాషా నేతృత్వంలో కమిషన్ ●
గ్లోబల్ ప్రపంచంలో యువత కుల, మతాలకతీతంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో కులాంతర ప్రేమ వివాహాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది అవమానంగా భావించిన పెద్దలు పరువు హత్యలకు పాల్పడుతున్నారు. నాగరిక సమాజంలో ద్వేష పూరితంగా ఒకరిని మరొకరు చంపడం ఆమోద యోగ్యం కాదు. ఈ పరువు హత్యలు సమాజం తల దించుకునేలా చేస్తున్నాయి. అందుకే పరువు హత్యను నిరోధించేందుకు ప్రత్యేక చట్టం అవశ్యం. ఈ నేపథ్యంలో వీటి నివారణకు ప్రత్యేక చట్ట రూపకల్పన చేస్తున్నాం. అని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు.
సాక్షి, చైన్నె : పరువు హత్యలను నిరోధించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చట్టం రూపకల్పన చేయనున్నారు. ఇందు కోసం జస్టిస్ కెఎన్ బాషా నేతృత్వంలో కమిషన్‌ను అసెంబ్లీ వేదికగా సీఎం స్టాలిన్ గురువారం ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజైన శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కేఎన్ నెహ్రు సమాధానం ఇస్తూ, చైన్నె శివారులోని పల్లావరం, పూందమల్లితో సహా 18 ప్రాంతాలకు శుద్ధీకరించిన సముద్రపు నీటి పంపిణీ నిమిత్తం నిర్లవరణీకరణ పథకాన్ని రూ.400 కోట్లతో అమలు చేయనున్నామని తెలిపారు. మంత్రి ఏవీ వేలు సమాధానం ఇస్తూ, ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకున్న కోయంబత్తూరు జీడీ నాయుడు వంతెనపై ప్రమాదాల నివారణ లక్ష్యంగా రబ్బర్ బంప్‌లు, సిగ్నల్స్‌ను ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. తమిళనాడులోని మందుల తయారీ పరిశ్రమల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులెవరూ తనిఖీలు చేయలేదని ఆరోగ్య మంత్రి ఎం సుబ్రమణియన్ స్పష్టం చేశారు. తాము పకడ్బందీ చర్యలతో తనిఖీలు విస్తృతం చేశామంటూ పిల్లల ప్రాణాలను బలిగొన్న దగ్గు సిరప్ కేసుకు సంబంధించిన అంశాలపై ప్రధాన ప్రతి పక్ష నేత పళణిస్వామి సందించిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. దివంగత నేత కలైంజ్ఞర్ కరుణానిధి పేరిట కుంభకోణంలో వర్సిటీ ఏర్పాటుకు గవర్నర్ ఇంత వరకు అనుమతి ఇవ్వలేదని ఉన్నత విద్యామంత్రి కోవి చెలియన్ వ్యాఖ్యానించారు. వరి కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని, తేమతో కూడిన వరి కొనుగోలుకు కేంద్రం నుంచి తమరైనా అనుమతి ఇప్పించండని ప్రధాన ప్రతి పక్ష నేత పళణిస్వామిని ఉద్దేశించి మంత్రి చక్రపాణి ఎదురు ప్రశ్నలు వేశారు.
వాగ్వివాదం
సభలో తమిళర్ వాల్వురిమై కట్చి ఎమ్మెల్యే వేల్ మురుగన్ ప్రసంగిస్తూ, అందియూరు, భవానీ సాగర్‌లకు నీటి ప్రాజెక్టులను అమలు చేయాలని కోరారు. ఇందుకు సీనియర్‌మంత్రి దురై మురుగన్ సమాధానం ఇస్తూ, ఆ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు అడగాల్సిన ప్రశ్నలను, పై నియోజకవర్గాలతో సంబంధం లేని తమరు ప్రశ్నలు అడగడం సబబు కాదన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించిన వేల్ మురుగన్ మోస పూరిత సమాధానం అని వ్యాఖ్యానించడంతో వాగ్వివాదం మొదలైంది. చివరకు స్పీకర్ అప్పావు మందలించడంతో వేల్ మురుగన్ మౌనంగా కూర్చోక తప్పలేదు. అదే సమయంలో అన్నాడీఎంకే సభ్యులు గుస...గుస లాడుతుండగా వారి వైపు చూసిన స్పీకర్ అప్పావు అవును..తనది పాము చెవులు.. మీరు చెప్పింది వినాల్సిన అవశ్యం లేదంటూ వ్యాఖ్యలు చేయడంతో సభలో నవ్వులు విరబూశాయి. ఇక, సభలో రాందాసు మద్దతు పీఎంకే ఎమ్మెల్యే అరుల్‌ను ఓ అంశం గురించి మాట్లాడేందుకు స్పీకర్ అనుమతి ఇవ్వగా, దీనిని వ్యతిరేకిస్తూ అదే పార్టీకి చెందిన అన్బుమణి మద్దతు ఎమ్మెల్యేలు ముగ్గురు నిరసనకు దిగారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని తమ ఆగ్రహం వ్యక్తం చేయగా, మీ గొడవలు బయట చూసుకోండి అని స్పీకర్ తీవ్రంగా హెచ్చరించడంతో ఆ ముగ్గురు తగ్గారు. అనంతరం ఆర్థిక నివేదికకు సమాధానం ఇస్తూ ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు ప్రసంగించారు. సీఎం స్టాలిన్ శ్రమకు ఫలితంగా తమిళనాడు అభివృద్ధి పరంగా రెండు శాతం ముందడుగు వేసిందని చెప్పారు. నిర్మాణాలు, భవిష్యత్తు కార్యాచరణలు అభివృద్ధికి మార్గాన్ని సుగమం చేస్తున్నాయన్నారు. కేంద్రం నిధుల వ్యవహారంలో చూపుతున్న వివక్షను గుర్తు చేస్తూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రూ. 4 వేలు కోట్లు విద్యా రుణాలు ఇవ్వాల్సి ఉండగా, రూ. 45 కోట్లు మాత్రమే ఇచ్చారని మండి పడ్డారు. చివరి రోజున సభలో గ్రామీణాభివృద్ధి, రహదారులు, విద్యుత్, హిందూ ధర్మాదాయ, తమిళాభివృద్ధి శాఖలకు సంబంధించిన బిల్లులు, తమిళనాడు ఆర్థిక చట్టం 2024 సవరణ ముసాయిదాతో పాటుగా మొత్తం 16 ముసాయిదాలను ఆమోదించారు.
కట్టడికి చర్యలు
ముందుగా అసెంబ్లీలో పలు పార్టీలు ఇటీవల కాలంగా చోటు చేసుకుంటున్న కులాంతర వివాహం, ప్రేమ వివాహం చేసుకున్న వారి హత్యలను ప్రస్తావిస్తూ పరువు హత్యను కట్టడి చేయడానికి చర్యలు చేపట్టాలని కోరారు. ఇందుకు సీఎం స్టాలిన్ సమాధానం ఇచ్చారు. మహాకవి తిరువళ్లురు సూక్తులను గుర్తు చేస్తూ, ఈ తమిళ భూమిలో కులం అనేది ద్వంద్వ ప్రమాణం తప్ప మరొకటి కాదని వ్యాఖ్యానించారు. తమిళుల సంస్కృతి గురించి వివరిస్తూ ఈ భూమిలో తాజాగా స్వరాలు బిగ్గరగా వినిపించడం చూస్తున్నామని గుర్తుచేశారు. విప్లవ కవి భారతీదాన్, ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్, దివంగత నేత అన్నా, కలైంజ్ఞర్ కరుణానిధితో పాటుగా ఇతర సంస్కరణ వాదుల ఆలోచనలను వివరించారు. అందరికీ విద్య, ఉద్యోగం, అధికార పదవులు, సమాన అవకాశం, అందరూ ఒక్కటే అన్న నినాదంతో ద్రావిడ మోడల్ పాలన ఈ రాష్ట్రంలో తాజాగా జరుగుతున్నాయన్నారు. సామాజిక న్యాయం దిశగా సాగుతున్న చర్యలు, చేపట్టిన వివిధ అంశాలను ఈసందర్భంగా వివరించారు. సామాజిక న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఉమ్మడి ఆస్తి, ఉమ్మడి హక్కులు, విద్యహక్కు, అధికార హక్కు అనే సూత్రాల ఆధారంగా ముందడుగు వేస్తున్నామన్నారు. నాగరిక సమాజంలో ద్వేష పూరితంగా ఒకరిని మరొకరు చంపడం ఆమోద యోగ్యం కాదని వ్యాఖ్యానించారు. పరువు హత్య సమాజాన్ని తల దించుకునేలా చేస్తున్నాయన్నారు. పరువు హత్యను నిరోధించేందుకు ప్రత్యేక చట్టం అవశ్యమని ప్రకటించారు. దీనిని రూపకల్పన చేసేందుకు జస్టిస్ కేఎన్ బాషా నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఈ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా చట్టం రూపకల్పన చేస్తామన్నారు. పరువు హత్య కేసులలో శిక్షలు కఠినం చేసే దిశగా ముందుకు వెళ్తామన్నారు.ఈ కేసులలో కులం ఒక్కటే కారణం కాదు. చాలా కారణాలు ఉన్నాయని, కారణం ఏదైనా హత్య..హత్యే అని దీనికి శిక్షలు కఠినం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఇక, అన్ని రకాల ఆధిపత్యాలకు ముగింపు పలుకుదామని, ప్రేమతో నిండిన మానవత్వాన్ని ఒక ఉద్యమంగా సృష్టించే ప్రచారంతో ముందడుగు వేద్దామని పిలుపు నిచ్చారు.
పరువు హత్యల
నిరోధక చట్టం

● రూపకల్పనకు జస్టిస్ కెఎన్ బాషా నేతృత్వంలో కమిషన్ ●